పాక్ ఆక్రమిత కశ్మీర్ వార్తల కవరేజ్.. అల్ జజీరాపై నిషేధం విధించిన పాకిస్థాన్

Al Jazeera banned in Pakistan for Pakistan occupied Kashmir news coverage
  • పీవోకేలో జరుగుతున్న అరాచకాలపై కథనాలు ప్రసారం చేసిన అల్ జజీరా
  • ఎల్లో జర్నలిజంకు పాల్పడుతోందంటూ పాక్ ప్రభుత్వం ఆగ్రహం
  • విదేశీ జర్నలిస్టుల కవరేజ్‌పై నిబంధనలను మరింత కఠినతరం చేసి పాక్

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా దళాల చర్యలపై విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారం చేసిన ఖతార్‌కి చెందిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అల్ జజీరా’పై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ సంస్థ వెబ్‌సైట్‌ను, సేవలను ఆంక్షల పరిధిలోకి తెస్తూ బ్లాక్ చేసింది. అల్ జజీరా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, సంచలనాల కోసం ‘ఎల్లో జర్నలిజం’కు పాల్పడుతోందని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


ముజఫరాబాద్ సహా పీవోకేలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల అవకతవకలు, తక్కువ పోలింగ్ శాతం, ప్రజల నిరసనలు, భద్రతా దళాల మోహరింపుపై అల్ జజీరా క్షేత్రస్థాయి కథనాలను ప్రసారం చేయడంపై పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాహ్య శక్తుల ప్రయోజనాల కోసమే ఆ సంస్థ ఏకపక్ష కథనాలను ప్రసారం చేస్తోందని మండిపడింది. ఈ క్రమంలో, పాకిస్థాన్ లోని విదేశీ జర్నలిస్టుల కవరేజ్‌పై నిబంధనలను మరింత కఠినతరం చేశారు.


ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాలు మినహా పీవోకే లాంటి ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేయడానికి విదేశీ జర్నలిస్టులకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర పాత్రికేయ రంగాన్ని అణచివేసేందుకే పాక్ ప్రభుత్వం ఇలాంటి డిజిటల్ సెన్సార్‌షిప్‌ను అస్త్రంగా వాడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Al Jazeera
Pakistan
Pakistan occupied Kashmir
Media ban
PoK protests
Digital censorship

More Telugu News