ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం!
- మంత్రి పెరియకరుప్పన్‌కు చేదు అనుభవం
- తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి
- మంత్రికి 83,374, టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు
- ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే యోచన
- 2006 నుంచి ఓటమి ఎరుగని మంత్రికి తొలిసారి పరాజయం
ఓట్ల లెక్కింపులో చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న పెరియకరుప్పన్‌కు తుది ఫలితం షాక్ ఇచ్చింది. అధికారులు ప్రకటించిన తుది లెక్కల ప్రకారం టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 83,375 ఓట్లు రాగా, మంత్రి పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కేసీ తిరుమారన్ 29,054 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఫలితంతో తిరుపత్తూరులో 2006 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్ 20 ఏళ్ల అజేయ ప్రస్థానానికి తెరపడింది.
ఫలితం వెలువడిన వెంటనే రీకౌంటింగ్ నిర్వహించాలని డీఎంకే ఏజెంట్లు కోరినప్పటికీ అధికారులు నిరాకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాన్ని మద్రాస్ హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే పార్టీ సిద్ధమవుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచి, అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించిన వేళ ఈ విజయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.