30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం.. జయలలిత తర్వాత ఓడిన రెండో ముఖ్యమంత్రిగా స్టాలిన్
- కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమిపాలైన స్టాలిన్
- అధికారంలో ఉండగా ఓడిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డు
- 1996లో బర్గూరులో ఓడిన జయలలిత
- కొళత్తూరులో స్టాలిన్ వరుస విజయాలకు బ్రేక్
తమిళనాడు చరిత్రలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత బర్గూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఈజీ సుగవనం చేతిలో ఓడిపోయారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
స్టాలిన్ తన రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలతో పాటు కొన్ని ఓటములను కూడా చూశారు. 1984లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన ఆయన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొళత్తూరుకు మారారు. 2011, 2016, 2021 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా గెలుపొందారు. అలాంటి కంచుకోటలో ఇప్పుడు ఓటమి చవిచూడటం గమనార్హం.
1996లో చెన్నైకి నేరుగా ఎన్నికైన తొలి మేయర్‌గా పనిచేసిన స్టాలిన్.. తండ్రి కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడయ్యారు. 2021లో పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు. అయితే, తన రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ గెలిచిన కరుణానిధి రికార్డుకు భిన్నంగా స్టాలిన్ ఓటమిని ఎదుర్కోవడం డీఎంకే చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోనుంది.