మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం
- భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- తన సభకు బీజేపీ ఆటంకం కలిగిస్తోందని ప్రసంగం ఆపేసిన మమత
- వంద మీటర్ల దూరంలోనే రెండు పార్టీల సభల నిర్వహణ
- గందరగోళానికి మమతే కారణమన్న సువేందు అధికారి
- ఈ నెల 29న భబానీపూర్‌లో పోలింగ్
భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ సభలను కేవలం 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా, సమీపంలోని బీజేపీ సభ నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా శబ్దాలు చేస్తూ తన సభకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన అవమానకరంగా ఉందని పేర్కొంటూ ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రసంగాన్ని ముగించకుండానే వేదిక నుంచి నిష్క్రమించారు.
ముఖ్యమంత్రి వెళ్లిపోయిన వెంటనే ఆగ్రహానికి గురైన టీఎంసీ కార్యకర్తలు నిరసనగా బీజేపీ సభా ప్రాంగణం వైపు దూసుకెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య నినాదాల పర్వం మొదలై, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. భద్రతా దళాలు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఈ గందరగోళానికి మమతా బెనర్జీనే కారణమని సువేందు అధికారి ఆరోపించారు. కాగా, 2011 నుంచి మమతకు కంచుకోటగా ఉన్న భబానీపూర్ నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.