శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్
- శ్రీవారి ఆర్జిత సేవల కోసం 65 వేల పట్టు శాలువాలు
- ధర్మవరంలో ఆప్కో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు
- ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన
- నమూనా శాలువాను ఆవిష్కరించిన మంత్రులు
ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ఈ శుభవార్తను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి సత్యకుమార్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ శాలువాల సరఫరా కోసం ధర్మవరంలో ప్రత్యేకంగా ఆప్కో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. దీని ద్వారా నేరుగా చేనేతల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి టీటీడీకి అందిస్తామని వివరించారు.
ఈ సందర్భంగా ధర్మవరం చేనేత కార్మికులు తయారు చేసిన నమూనా పట్టు శాలువాను మంత్రులు సవిత, సత్యకుమార్ ఆవిష్కరించారు. టీటీడీ నిర్ణయంతో ధర్మవరం ప్రాంతంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఉపాధి లభించనుండటంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.