బంగారం, వెండి దిగుమతి సుంకం తగ్గింపు.. అయినా రికార్డు స్థాయికి ధరలు!
- దిగుమతి అంచనా విలువ తగ్గించిన కేంద్రం
- ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,65,100కు చేరిక
- ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో మంటలు
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర మళ్లీ 5,000 డాలర్ల మార్కును దాటేసింది.
మరోవైపు, దేశీయంగా దిగుమతిదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే 'నోషనల్ వాల్యూ'ను (కనీస అంచనా విలువ) తగ్గించింది. 10 గ్రాముల బంగారంపై ఈ విలువను 1,568 డాలర్ల నుంచి 1,518 డాలర్లకు, అలాగే కిలో వెండిపై 3,457 డాలర్ల నుంచి 2,657 డాలర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు కేవలం బంగారం కడ్డీలు, నాణేలు, బిస్కెట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆభరణాల దిగుమతులకు కాదని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ ధరలను బట్టి ప్రభుత్వం ఈ విలువను సవరిస్తూ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దిగుమతి సుంకం భారం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారుడికి మాత్రం పసిడి సెగ తప్పలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.