తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
- డిసెంబర్, జనవరి నెలల్లోని పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం
- వైకుంఠ ఏకాదశి, రథసప్తమి రోజుల్లో అమలుకానున్న ఆంక్షలు
- ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడి
- సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసిన దేవస్థానం
టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, డిసెంబర్ 29న వైకుంఠ ఏకాదశికి ముందు రోజు, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అలాగే జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండవు. అయితే, ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది.
ఈ ప్రత్యేక రోజుల్లో బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చిచెప్పింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు, భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి వంటి పవిత్రమైన రోజుల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఈ నిర్ణయం సామాన్య భక్తులకు ఎంతో ఊరటనిస్తుందని భావిస్తున్నారు.