గజ్వేల్ లో ఒకే కాలనీకి ఆరు పేర్లు
- వీధి మొదట్లో రాత్రికి రాత్రే వెలిసిన నేమ్ బోర్డులు
- ఉన్నదే 25 ఇళ్లు.. కానీ కాలనీకి మాత్రం ఆరు పేర్లు
- నాడు వినాయక నగర్.. నేడు కులానికి ఓ పేరు
గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ముట్రాజ్‌పల్లి రోడ్డు పక్కన వినాయక నగర్ కాలనీ ఉంది. ఇక్కడి కుటుంబాలలో 70 శాతం ఒకే సామాజికవర్గం కాగా మిగతా 30 శాతం వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నారు. కాలనీ ఏర్పాటైన కొత్తలో ‘వినాయక నగర్’ అని నామకరణం చేసుకున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఓ గొడవతో కాలనీలో కుల విభేదాలు పొడసూపాయి.
దీంతో మెజార్టీ సామాజిక వర్గం ఈ కాలనీకి తమ కులం పేరుతో నేమ్ బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మిగతా కులాల వారు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. దీంతో మిగతా కులాల కుటుంబాలు కూడా తమ కులాల పేర్లతో రెడ్డి ఎన్ క్లేవ్, ఆర్యవైశ్య ఎన్ క్లేవ్, ముదిరాజ్ ఎన్ క్లేవ్, విశ్వకర్మ ఎన్ క్లేవ్, యాదవ్స్ ఎన్ క్లేవ్ పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. వీధి మొదట్లో ఆరు నేమ్ బోర్డులు కనిపించడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.