Champions Trophy 2025: బాప్‌రేబాప్.. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన మొత్తం వ్యూస్ తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే!

- ఇటీవల దిగ్విజయంగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్
- జియోహాట్‌స్టార్‌లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ ప్రేక్షకాదరణ
- భారత్, కివీస్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కి 90 కోట్లకు పైగా వ్యూస్
- మొత్తంగా ఈ మెగా ఈవెంట్‌కు 540.3 కోట్ల వ్యూస్
- ఇది భారత్ (143 కోట్లు), చైనా (141 కోట్లు) జనాభా కంటే రెట్టింపు
ఇటీవల పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దిగ్విజయంగా ముగిసిన విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మరోసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ సాధించిన టీమిండియా... ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ సారథ్యంలో ట్రోఫీని కైవసం చేసుకుంది. మొత్తంగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది భారత్.
ఇక జియోహాట్‌స్టార్‌లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వ్యూస్ పరంగా రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఏకంగా 90 కోట్లకు పైగా వీక్షణలు దక్కించుకోవడం విశేషం. మరి మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే.
జాతీయ మీడియా సమాచారం ప్రకారం భారీ ఆదరణ పొందిన ఈ మెగా ఈవెంట్‌కు 540.3 కోట్ల వ్యూస్ రాగా... 11వేల కోట్ల నిమిషాలపాటు వాచ్‌టైమ్‌గా నమోదైంది. ఇది భారత్ (143 కోట్లు), చైనా (141 కోట్లు) జనాభా కంటే రెట్టింపు కావడం విశేషం. ఏకకాలంలో 6.2 కోట్ల వ్యూవర్స్ కూడా వీక్షించినట్లు తెలుస్తోంది.
జియోహాట్‌స్టార్ డిజిటల్ సీఈఓ కిరణ్ మణి మాట్లాడుతూ... "ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ ప్రేక్షకాదరణ దక్కింది. కోట్ల మంది వీక్షించే అవకాశం వచ్చింది. భారత్-ఆసీస్ మధ్య తొలి సెమీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సింగిల్ డేలోనే అత్యధిక సబ్‌స్క్రిప్షన్లను సాధించడం జరిగింది" అని అన్నారు.
అలాగే హిందీ మాట్లాడే ప్రాంతాలు ఏకంగా 38 శాతం వీక్షణలను అందించాయని ఆయన తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి భారీగా వ్యూస్ వచ్చాయన్నారు.