G Jagadish Reddy: కాంగ్రెస్‌పై ప్రజల భాషను వింటే ముఖ్యమంత్రి నిమిషం కూడా ఆ పదవిలో ఉండరు: జగదీశ్ రెడ్డి

- ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గులేకుండా ఆ పదవిలో కొనసాగుతున్నారన్న బీఆర్ఎస్ నేత
- అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పే కార్యక్రమం మొదలు పెట్టామన్న జగదీశ్ రెడ్డి
- అందుకే తనను సస్పెండ్ చేశారన్న జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల ఆక్రోషం, వారి భాషను వింటే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండరని, కానీ సిగ్గులేకుండా ఉంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సస్పెన్షన్ తనను భయపెట్టదన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చామని ఆయన అన్నారు. ఇలాంటి సస్పెన్షన్‌లు తమ గొంతు నొక్కలేవని ఆయన అన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పే కార్యక్రమం మొదలైనందునే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన అన్నారు. తన సస్పెన్షన్‌కు సరైన కారణం చూపించలేదని పేర్కొన్నారు. సభలో తాను మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారని, వారిని అదుపు చేయమని సభాపతిని కోరానని చెప్పారు. అధికార పార్టీ సభ్యులను ఏమీ అనలేక తనను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా చెప్పారని అన్నారు.
బీఆర్ఎస్ శాసన సభ్యులకు మాట్లాడే అవకాశం రాకుండా సభలో వరుసగా 26 మందిని మాట్లాడించారని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి వారికి క్లాస్ పీకి వెళ్లాడని, అందుకే ప్రతిపక్షం గొంతు వినపడకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే తనను సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తయారు చేసిన ఉద్యమకారులమని, పదవులే తాము తృణపాయంగా వదిలేశామని, ఇలాంటి సస్పెన్షన్ తమకు లెక్క కాదని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన సైనికులమని అన్నారు. ఇలాంటివి గతంలో చూడని అనుభవాలేమీ కాదని అన్నారు. సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పే కార్యక్రమం ప్రారంభమైందని, ఆ భయంతోనే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కుట్రతో సస్పెండ్ చేశారని, ప్రజల్లో దీనిని ఎండగడతామని ఆయన అన్నారు. వీటిని న్యాయస్థానాల్లోనూ ఎదుర్కొంటామని చెప్పారు.