Vamsi: ఆకలితో రోడ్లపై తిరిగిన రోజులున్నాయ్: దర్శకుడు వంశీ

- దర్శకుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న వంశీ
- గొప్ప హిట్లు ఇచ్చిన దర్శకుడిగా పేరు
- తొలినాళ్లలో ఇబ్బందులు పడ్డానని వెల్లడి
- 'సితార' వంటి కథపై కసరత్తు జరుగుతోందని వివరణ
ఒక 'సితార' .. ఒక 'అన్వేషణ' .. ఒక 'లేడీస్ టైలర్' వంటి సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అందుకు కారణం వంశీ దర్శక ప్రతిభ అని చెప్పక తప్పదు. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఆ సినిమాలు కథాకథనాల పరంగానే కాదు, మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచాయి. తన కథలను .. పాటలను గోదావరి తీరంలో పరిగెత్తించిన వంశీని ఆ సినిమాలు ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి.
అలాంటి వంశీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన ఏబీఎన్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నా 50 ఏళ్ల కెరియర్ ను గురించి తలచుకుంటే, ఎలా మొదలైంది .. ఎలాంటి మలుపులు తిరిగింది నా కళ్లముందు కదులుతూ ఉంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కోడంబాకం రోడ్లపై ఆకలితో ఎలా తిరిగాననేది నాకు గుర్తుంది" అని అన్నారు.
"నేను చేసిన సినిమాలలో 'సితార' నాకు మంచిపేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఒక గొప్పకథ దగ్గర ఉంది. గతంలో నాతో హిట్ సినిమాలు చేసిన ఒక నిర్మాతకు ఆ కథను వినిపించాను. వాళ్లకు ఆ కథ చాలా బాగా నచ్చింది. మంచి హ్యూమర్ .. గొప్ప గొప్ప విజువల్స్ .. చక్కని సంగీతానికి అవకాశం ఉన్న కథ అది. ఆ కథను సినిమాగా చేస్తే తప్పకుండా మరో అద్భుతమవుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి.