అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేయని ప్రయత్నమంటూ లేదు: బొండా ఉమ ఆరోపణలు
- అవినాష్ ను కాపాడేందుకు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో లెక్కే లేదు
- అడ్డంగా దొరికినా బుకాయిస్తున్నారు
- కేసును సీబీఐ సగమే వెలికి తీసిందన్న ఉమ
వివేకా హత్య కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. ఆయన్ను కాపాడేందుకు జగన్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో లెక్కేలేదన్నారు. హత్య జరిగిన రోజు నుంచి జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
సాక్ష్యాలు దొరకకుండా నిందితులు జాగ్రత్త పడ్డారని, హత్యకు సంబంధించి సీబీఐ సగం కేసునే వెలికి తీసిందని చెప్పారు. అవినాష్ రెడ్డి నాటకాలాడి తమపై విషప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వివేకా హత్యను గెలుపు కోసం వాడుకున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే కేసును తప్పుదోవ పట్టించారన్నారు. హత్యలో వైసీపీ నేతల ప్రమేయమున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.