మొదటి నుంచి కూడా 'సోనీ లివ్' క్వాలిటీ విషయంలో రాజీలేని భారీ వెబ్ సిరీస్ లను అందిస్తూ వస్తోంది. బలమైన కథాకథనాలకు ప్రాధాన్యతనిస్తూ, విలక్షణమైన కంటెంట్ ను అందిస్తూ వెళుతోంది. అలా 'సోనీ లివ్' మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది .. ఆ సిరీస్ పేరే 'ఐస్'. నిఖిలా విమల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ను , 7 ఎపిసోడ్స్ గా రూపొందించారు. మొత్తంగా చూసుకుంటే ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాల వరకూ ఉంది. ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, తెలుగులోనూ అందుబాటులో ఉంది.

ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకోవడం .. ఏ మాత్రం తేడా వచ్చినా వాళ్ల ప్రాణాలు తీయడం సర్వ సాధారణమైపోయింది. పెళ్లి తరువాత భర్త వేధింపులను భరిస్తూ వస్తున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ప్రేమించిన అమ్మాయిని .. తమని నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని హత్య చేయడానికి ఏ మాత్రం వెనుకాడని అబ్బాయిల ధోరణి అందరిలో భయాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టడానికి .. అబ్బాయిలను కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి 'విద్య' ఒక సాఫ్ట్ వేర్ ను కనిపెడుతుంది.  జరగబోయే నేరాలను ముందుగానే పసిగట్టే ఆ సాఫ్ట్ వేర్ పేరే 'ఐస్'.  

 అమ్మాయిలపై అబ్బాయిల దాడులను ముందుగానే పసిగట్టి, వాళ్లలో నేర ప్రవృత్తికి అడ్డుకట్ట వేయడమే ఈ సాఫ్ట్ వేర్ లక్ష్యం. పాజిటివ్ పోలీసింగ్ ద్వారా పోలీస్ డిపార్టుమెంట్ ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడానికి సహకరించవలసినదిగా ఆమె పోలీస్ డిపార్టుమెంట్ ను కోరుతుంది. దాంతో డిపార్టుమెంట్ వారు ఆ వైపు నుంచి ఆమెకి పోలీస్ ఆఫీసర్ 'టీనా'ను .. కానిస్టేబుల్ 'జస్టిన్'ను ఇస్తారు. మానసిక వైద్య నిపుణురాలు అయిన 'అయేషా' ( నిఖిలా విమల్) కూడా తన అసిస్టెంట్ 'తన్వీ'తో ఈ టీమ్ లోకి వస్తుంది. 

ఈ సాఫ్ట్ వేర్ ఎలా పనిచేస్తుందనేది తెలుకోవడం కోసం ట్రైల్స్ మొదలుపెడతారు. ప్రేమ పేరుతో హీరోయిన్ 'రీతూ' వెంటపడుతున్న 'మిలన్' పై .. 'వర్ష'ను వేధిస్తున్న 'హేమంత్'పై .. 'జెస్సీ'ను టార్చర్ చేస్తున్న 'ప్రియన్'పై టెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఈ కేసుల విషయంలో వాళ్లు సతమతమవుతూ ఉండగానే, తెరపైకి ఐఏఎస్ ఆఫీసర్ 'సాజిన్' (దేవ్ మోహన్) అతని భార్య 'శోభిత'కి సంబంధించిన కేసు తెరపైకి వస్తుంది. ఈ కేసులను 'ఐస్' టీమ్ ఎలా సాల్వ్ చేస్తుంది? ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది మిగతా కథ.

పరిచయం .. స్నేహం .. ఆకర్షణ .. ప్రేమ .. ఇలా అంచలంచెలుగా యువత ప్రేమ వరకూ వెళుతోంది. ఒకరికొకరు దగ్గరవుతున్నా కొద్దీ ఒకరి స్వభావం ఒకరికి అర్థమవుతూ ఉంటుంది. అబ్బాయిల మెంటాలిటీ తమకి సెట్ కాదని అమ్మాయిలు భావించి వాళ్లని దూరం పెట్టే ఆలోచన చేయడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. అదే వాళ్ల ప్రాణాల మీదికి తెస్తోంది. అబ్బాయిలను నేరస్థులను చేస్తోంది. అసహనం .. కోపం .. ద్వేషం .. దురలవాట్లు అబ్బాయిలను నేరస్థులుగా నిలబెడుతున్నాయి. 

ఇక పెళ్లి తరువాత కూడా చాలామంది అమ్మాయిలు .. అబ్బాయిలు కలిసి ఉండలేకపోతున్నారు. ఉన్నతమైన పదలవులలో ఉన్నవారు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి వాళ్లను మార్చడానికి ప్రయత్నించే ఒక సాఫ్ట్ వేర్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రమాదం జరగడానికి ముందే అటు బాధితులను .. ఇటు పోలీస్ శాఖను అప్రమత్తం చేసే ఒక ఆలోచనతో కూడిన ఈ కాన్సెప్ట్ ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం కాలంలో ఈ తరహా టెక్నాలజీ అవసరం అనిపిస్తుంది. 

ఐదు జంటల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. ఈ ఐదు జంటల చుట్టూ చోటుచేసుకునే అనూహ్యమైన సంఘటనల సమాహారమే ఈ సిరీస్. మారుతున్న పరిస్థితులు .. మనుషులు .. స్వభావాలపై పూర్తిగా ఫోకస్ చేస్తూ, నేరాలు జరగడానికి కారణాలు .. జరగకుండా చూడటానికి అవసరమైన విధానాలను ఆవిష్కరిస్తూ వెళ్లారు. 

విద్య .. అయేషా .. రీతూ .. ఈ మూడు పాత్రలు చాలా ప్రధానమైనవిగా తెరపైకి తీసుకుని వచ్చారు.
కానీ ఈ మూడు పాత్రలు చాలా నిదానంగా .. నీరసంగా కదులుతూ ఉంటాయి. టీమ్ యాక్టివ్ గా లేకుండా డల్ గా ఉండటమే ఈ సిరీస్ లో ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. 'ఐస్'కి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఎలా పనిచేస్తుందని అర్థమయ్యేలా చెప్పగలిగారు. కానీ దాని చుట్టూ ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలను డిజైన్ చేసుకోలేకపోయారు. 

ఇక దర్శకుడు ఈ కేసులన్నింటికీ సంబంధించిన పరిష్కారాలు చివరి ఎపిసోడ్లోనే చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందువలన 6 ఎపిసోడ్స్ లోని అంశాలు కాస్త ఓపికగా భరించవలసి ఉంటుంది. చివరి ఎపిసోడ్ .. ముందున్న ఎపిసోడ్స్ బలాన్ని పెంచేదిలా ఉండటం కాస్త ఊరట కలిగిస్తుంది.ఆరంభంలో కాస్త యాక్టివ్ గా అనిపించిన విద్య .. రీతూ పాత్రలు ఆ వెంటనే నీరసించిపోతాయి. ఇక పోలీస్ ఆఫీసర్ టీనా పాత్రను కూడా సరిగ్గా డిజైన్ చేసినట్టుగా అనిపించదు. 

పాత్రలకు తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసుకోగలిగారు. వాళ్లంతా కూడా చాలా సహజంగా చేశారు. గౌతమ్ శంకర్ ఫొటోగ్రఫీ .. రంజిన్ రాజ్ నేపథ్య సంగీతం .. అభిలాష్ బాలచంద్రన్ ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణం పరంగా .. క్వాలిటీ పరంగా ఈ సిరీస్ కి వంకబెట్టవలసిన పనిలేదు. చెప్పదలచుకున్న పాయింట్ కూడా బాగుంది. కానీ ఆ విషయాన్ని నిదానంగా .. నింపాదిగా .. తాపీగా చెప్పుకుంటూ వెళ్లడమే అసంతృప్తిని కలిగిస్తుంది.