తమిళంలో చాలా చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సూరి, ఇప్పుడు కథానాయకుడిగా విజయాలను అందుకుంటూ దూసుకెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తెలుగులో సుహాస్ కూడా తన కెరియర్ విషయంలో అలాగే ఎదగడం కనిపిస్తుంది. అలాంటి ఈ ఇద్దరూ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'మండాడి'. మది మారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (అక్టోబర్ 8వ తేదీ) నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అది సముద్ర తీరప్రాంతంలోని 'కళింగపట్నం' అనే ఊరు. అక్కడ అంతా జాలరులు నివసిస్తూ ఉంటారు. 'జాతర'కి ముందు అక్కడ పడవ పందాలు నిర్వహిస్తూ ఉండటం తరతరాల నుంచి వస్తుంటుంది. పడవ పందాలలో ఎప్పుడూ కూడా 'మండాడి' జట్టు విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. ఈ జట్టుకి 'కాళీ' (సూరి) పులి (సుహాస్) ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. పడవ పోటీలకు సంబంధించిన మెళకువలను వాళ్లు 'మునెయ్య' (సత్యరాజ్) దగ్గర నేర్చుకుంటారు.
మునెయ్య కూతురు చిలకమ్మ (మహిమా నంబియార్) .. కాళీ ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత జరిగిన కొన్ని అనూహ్యమైన సంఘటనల కారణంగా కాళీ తన ఊరొదిలి వెళ్లిపోతాడు. నగరంలో చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదించుకుని కాలం గడుపుతూ ఉంటాడు. అలా 20 ఏళ్లు గడిచిపోతాయి. ఎప్పటిలానే కళింగపట్నంలో పడవపందాలు మొదలవుతాయి. అప్పుడు జరిగిన గొడవలలో 'పులి' కొడుకు కిశోర్ గాయపడతాడు.
కిశోర్ పై దాడి చేసిన 'మల్లేశ్' తనని 'పులి' చంపేస్తాడని భయపడిపోయి నగరానికి పారిపోతాడు. అక్కడ 'కాళీ' ఆశ్రయాన్ని పొందుతాడు. తన కొడుకును గాయపరిచిన మల్లేశ్ కి కాళీ ఆశ్రయం ఇచ్చాడనే విషయం పులికి తెలుస్తుంది. దాంతో మల్లేశ్ తో పాటు కాళీని కూడా లేపేయమని తన అనుచరులను పంపిస్తాడు పులి. అతను పంపించిన అనుచరుల బారి నుంచి తప్పించుకున్న కాళీ, మల్లేశ్ ను వెంటబెట్టుకుని తన సొంత ఊరుకు .. పులి ఇంటికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఆ ఊరును .. ప్రేమించిన చిలకమ్మను వదిలిపెట్టి కాళీ ఎందుకు వెళ్లిపోతాడు? మల్లేశ్ కీ .. కాళీకి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
సముద్ర తీరప్రాంతంలోని ఒక జాలరి గూడెం .. అక్కడ జరిగే పడవ పందాలు .. ఎప్పుడూ విజేతలుగా నిలిచే ఇద్దరు స్నేహితులు .. ఆ తరువాత బద్ధ శత్రువులుగా మారతారు. అందుకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? అనే ఒక ప్రధానమైన అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. స్థానికంగా ఉండే కుట్రలు - కుతంత్రాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది.
కాళీ .. పులి మధ్య కోపం - ద్వేషం అనే వాటితోనే ఈ కథ మొదలవుతుంది. మల్లేశ్ అనే కుర్రాడి కోసం ఇద్దరి మధ్య గొడవలు మళ్లీ ముదురుతూ వెళతాయి. చాలా కాలం క్రితం కాళీ - పులి వదిలేసిన పడవపందాలు మళ్లీ తెరపైకి రావడం వంటి సన్నివేశాలు ఫస్టాఫ్ క్రిందికి వెళతాయి. ఫస్టాఫ్ నడుస్తున్నంత సేపు, అసలు కాళీ - పులి మధ్య శత్రుత్వానికి దారితీసిన పరిస్థితులు ఎలాంటివి? అనే ఒక కుతూహలం ఆడియన్స్ లో పెరుగుతూ వెళుతుంది. అందుకు సమాధానంగా సెకండాఫ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
కాళీ 20 ఏళ్ల క్రితం ఊరొదిలికి ఎందుకు సిటీకి వస్తాడు? అతనిని వెతుక్కుంటూ వచ్చిన మల్లేశ్ ఎవరు? తన కోసం గాలిస్తున్న పులి మనుషులకు ఆ కుర్రాడు చిక్కుతాడా? తనని .. ఆ కుర్రాడిని చంపడానికి పులి అనుచరులు ఎదురుచూస్తుంటే, కాళీ నేరుగా వాళ్ల ముందుకు వెళ్లడం వంటి సన్నివేశాలు ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతాయి. మళ్లీ పుంజుకున్న శత్రుత్వం మరింత ఉత్కంఠను పెంచుతుంది.
ఈ కథలో సున్నితమైన ప్రేమతో కూడిన భావోద్వేగాలు ఉన్నాయి. గురువు శిష్యుల మధ్య అనుబంధం ఉంది .. స్నేహితుల మధ్య అభిమానం ఉంది. యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కనిపిస్తుంది. కథాకథనాలను ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దిశగా నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పడవ పందాలకు సంబంధించిన ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పొచ్చు.
ఈ కథకు కాళీ .. పులి పాత్రలు రెండు కళ్లుగా కనిపిస్తాయి. ఈ రెండు పాత్రలను తీర్చిద్దిన విధానం విషయంలోనే దర్శకుడు సగం సక్సెస్ సాధించాడని చెప్పాలి. స్నేహం కోసం వదిలేసే పాత్రలో కాళీ కనిపిస్తే, స్నేహాన్నే వదిలేసే పాత్రలో పులి కనిపిస్తాడు. ప్రేమను త్యాగం చేసిన కాళీ, పెళ్లి చేసుకోకుండా మిగిలిపోవడం మనసును భారం చేస్తుంది. స్నేహం కన్నా .. ప్రేమకన్నా తన ఊరు పేరు నిలబెట్టడం కోసం అతను తిరిగిరావడం ఆ పాత్ర ఔన్నత్యాన్ని చాటుతుంది.
కథిర్ ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం .. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. కథ .. కథనం .. పాత్రలను డిజైన్ చేయడం .. సన్నివేశాలను అల్లుకోవడం .. ఇలా అన్ని అంశాలు కూడా చాలా బలంగా కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా నడుస్తూ ప్రేక్షకులను తమలో కలుపుకుంటాయి. బలమైన స్థానికతను కలుపుకుంటూ సాగే ఈ కథ ప్రేక్షకులను నిరాశ పరచదు.
'మండాడి' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Mandaadi Review
Movie Details
Movie Name: Mandaadi
Genre: Action, Drama
Release Date: 2026-10-08
Cast: Soori,Suhas,Mahima Nambiar,Sathyaraj,Ravindra Vijay,Bala Saravanan
Director: Mathimaran Pugazhendhi
PRO: -
Music: G V Prakash Kumar
Banner: RS Infotainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer