వినోదాత్మక కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు కథానాయకుడు శ్రీ విష్ణు. ఆయన సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ జాబితాలోనే  శ్రీ విష్ణు మరో వినోదాత్మక కథాంశంతో నటించిన చిత్రం 'కామ్రేడ్‌ కల్యాణ్‌'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం. 

1992వ సంవత్సరంలో జరిగే కథ ఇది.  మాడుగుల అనే ప్రాంతానికి చెందిన కల్యాణ్‌ (శ్రీ విష్ణు)  ఆర్‌.నారాయాణ మూర్తికి వీరాభిమాని. అరకొర చదువు మాత్రమే చదువుకున్న కల్యాణ్‌  థియేటర్‌ను లీజుకు తీసుకుని ఆర్‌.నారాయణ మూర్తి సినిమాలు ప్రదర్శిస్తూ కాలం గడుపుతుంటాడు.  ఓసారి అనుకోకుండా ప్రాణపాయ స్థితిలో ఉన్న తన తల్లి (రాధికా శరత్‌కుమార్‌)ని కేరళ నుంచి వచ్చిన సితార దేవి (మహిమా నంబియార్‌) కాపాడుతుంది. అప్పటి నుంచే కల్యాణ్‌ ఆమె ప్రేమలో పడిపోతాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటాడు.  తన మనసులోని ప్రేమను సితారదేవికి తెలియజేయాలని అనుకుంటున్న తరుణంలోనే  ఓ నిజం తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న కల్యాణ్‌ ఎలాగైనా సితారను, ఆమె కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుంటాడు.  అందుకోసం ఎవరూ చేయని, సాహసించని దారిని ఎంచుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది? కల్యాణ్‌ కామ్రేడ్‌ కల్యాణ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ తరువాత జరిగిన పరిణామాలేమిటి? సితార కుటుంబాన్ని కష్టాల నుంచి ఎలా గట్టెక్కించాడు? పోలీస్ ఆఫీస‌ర్ (షైన్ టామ్ చాకో) కు ఈ కథకు సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ 

ఈ సినిమా ప్రచార చిత్రాల్లో ఉన్నట్లుగా నక్సలైట్స్‌ దళాలు, పోలీసులు.. ఇలా కనిపించగానే అందరూ ఇదొక సీరియస్‌ కథ అనుకుంటారు. అయితే ప్రారంభ నేపథ్యం అలాంటి ఆలోచన కలిగించినప్పటికీ ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా. ఇప్పటి వరకు నక్సల్‌ నేపథ్యంలో వచ్చిన సీరియస్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా అల్లుకున్న కథ ఇది. ప్రతి సన్నివేశంలో కామెడీ పండించడానికి మాత్రమే ట్రై చేశారు. ఎలాంటి లాజిక్‌లు లేకుండా ఆడియన్స్‌ను నవ్వించడమే ధ్యేయంగా తెరకెక్కించిన సినిమా ఇది.  బాలకృష్ణ అభిమానిగా రాధికా శరత్‌కుమార్‌ చేసే హడావుడి, శ్రీ విష్ణు తన ప్రేమను హీరోయిన్‌కు  తెలియజేయడానికి పడే పాట్లతో.. అక్కడక్కడా పండిన కామెడీ సన్నివేశాలతో  ఫస్టాఫ్ అంతంత మాత్రంగా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంటుంది. 

ఇక సెకండాఫ్‌లో కథను నడిపించడంలోనే అసలు సమస్య ప్రారంభమవుతుంది. అందుకే దర్శకుడు సెకండాఫ్‌ను కూడా పూర్థిస్థాయి కామెడీతో గట్టెక్కించాలనుకున్నాడు. అయితే ఈ ప్రయత్నం ఫలించలేదు. దుబాయ్‌ బాబుగా సత్య పాత్ర కాసేపు నవ్విస్తుంది. సత్య రాసే ప్రేమలేఖ ఎపిసోడ్‌ ఓ మోస్తరుగా అలరిస్తుంది. బిశ్వాస్‌ పాత్రలో ఉపేంద్ర లిమాయే చేసిన కామెడీ వర్కవుట్‌ కాలేదు. ఈ ట్రాక్‌ కూడా పండి ఉంటే సినిమా రిజల్ట్‌కు ప్లస్‌ అయ్యేది. వెన్నెల కిషోర్‌ కూడా తన పాత్రతో నవ్వులు పూయించే ప్రయత్నం చేసినా అది అంతగా ఆకట్టుకొలేకపోయింది. సెకండాఫ్‌లో వచ్చే కన్‌ఫ్యూజన్‌  కామెడీ ఇంతకు ముందే చాలా సినిమాల్లో చూసినట్లుగా అనిపించడంతో విసుగు తెప్పిస్తుంది. 

ఉపేంద్ర లిమాయే పాత్ర ప్రారంభంలో నవ్వించినా రాను రాను ఆ కామెడీ  బోరింగ్‌గా మారిపోయింది. కామెడీ సినిమా కాబట్టి ఈ కథాంశంలో ఎలాంటి లాజిక్కులు ఉండవు. 90ల నేపథ్యంలో కొనసాగే కథ అయినా సినిమాటిక్‌ లిబర్టీతో చాలా సన్నివేశాల్లో ప్రస్తుత సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సినిమా ఆద్యంతం గ్రాఫ్‌గా చెప్పుకుంటూ పడుతూ లేస్తూ ఉన్న ఈ కథకు పతాక సన్నివేశాలు కూడా అంతా ఇంపాక్ట్‌గా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా నవ్వించాలనే ధ్యేయంతో రొటిన్‌ కామెడీతో రూపొందిన కామ్రేడ్‌ కల్యాణ్‌లో అక్కడక్కడా నవ్వులు పూసిన రైటింగ్‌లో ఏ మాత్రం కొత్తదనం మాత్రం కనిపించదు. 


శ్రీవిష్ణుకు ఇలాంటి పాత్రలు చేయడంలో అలవాటుపడటంతో కల్యాణ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. కమెడియన్స్‌ సుదర్శన్‌, సత్యతో కలిసి నవ్వించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. మహిమా నంబియార్‌ పాత్రకు నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. రాధికా శరత్‌కుమార్‌, సత్య రఘుబాబు, ఉపేంద్ర లిమాయో, వెన్నెల కిశోర్‌, మురళీధర్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అడవిలో చిత్రీకరణ, అక్కడి విజువల్స్‌, కథకు తగ్గ లోకేషన్స్‌ల్లో చిత్రీకరణతో సాయి శ్రీరామ్‌ కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. 


రొటిన్‌ కథతో... ఏ మాత్రం కొత్తదనం లేకుండా  అక్కడక్కడ నవ్వించే కామెడీ సన్నివేశాలతో.. ఎలాంటి లాజిక్‌లు లేకుండా, ప్రేక్షకులకు నవ్వులు పంచాలని చేసిన 'కామ్రేడ్‌ కల్యాణ్‌' ప్రయత్నం పూర్థిస్థాయిలో సఫలీకృతం కాలేదు. కామెడీ ఎలా ఉన్నా ఫర్వాలేదు.. మాకు టైమ్‌ పాస్‌ అవుతుంది అని భావించే ప్రేక్షకులకు 'కామ్రేడ్‌ కల్యాణ్‌' ఓ మోస్తరుగా నచ్చే అవకాశం ఉంది.