మమతను ఓడించిన సువేందుకే సీఎం పీఠం?.. ఉత్కంఠగా మారిన ఎంపిక
- పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు
- సీఎం రేసులో ముందంజలో ఉన్న సువేందు అధికారి
- మమతా బెనర్జీని ఓడించడంతో పెరిగిన ప్రాధాన్యం
- అభ్యర్థిని ఖరారు చేసేందుకు కోల్‌కతాకు అమిత్ షా
- సువేందుకే పట్టం కట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్
సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అందరి దృష్టి సువేందు అధికారిపైనే కేంద్రీకృతమై ఉంది. ఆయన 2021లో నందిగ్రామ్‌లో, ఇటీవలి ఎన్నికల్లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించి ‘జెయింట్ కిల్లర్’గా పేరు తెచ్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం వహించింది ఆయనేనని, కార్యకర్తల్లో తీవ్రమైన ఉత్సాహాన్ని నింపారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సువేందుకే సీఎం పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.
మరోవైపు, మహిళా ముఖ్యమంత్రిని నియమించాలనే వాదనతో అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ పేర్లతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అయితే, సువేందుకున్న ప్రజాకర్షణ, దూకుడు స్వభావం, పరిపాలనానుభవం ఆయనను ఈ రేసులో ముందంజలో నిలిపాయి. టీఎంసీ నుంచి బీజేపీలో చేరినప్పటికీ, పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడంలో ఆయన సఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను కాదని వేరొకరిని ఎంపిక చేస్తే, అది పార్టీ కేడర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం జరగనున్న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం తర్వాత సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.