త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
- అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరగవచ్చని అభిప్రాయపడిన విశ్లేషకులు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కొట్టిపారేయలేమన్న ప్రభుత్వ వర్గాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన రెండు నెలలు దాటింది. దీనితో అంతర్జాతీయంగా ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ వివిధ కారణాల వల్ల మన దేశంలో ఇప్పటి వరకు ధరలు పెరగలేదు.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలను ఇప్పటి వరకు పెంచలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్, పారిశ్రామిక డీజిల్, 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ ధరలు, విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఫ్యూయల్ ధరలు మాత్రమే పెరిగాయి.
సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని తాజాగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లీటరుకు రూ.25-28 పెరగవచ్చని అంచనా వేశారు.