ట్రంప్ ‘నరకం’ వార్నింగ్‌కు ఇరాన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్
- 1980 నాటి ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పరాజయాన్ని గుర్తు చేసిన ఇరాన్
- టెహ్రాన్‌లో బందీల విడుదల కోసం అమెరికా చేసిన విఫలయత్నం
- ఇసుక తుపాను, సాంకేతిక లోపాలతో 8 మంది సైనికులను కోల్పోయిన అమెరికా
- చరిత్రను గుర్తుచేస్తూ మరోసారి తప్పు చేయొద్దని పరోక్ష హెచ్చరిక
నాడు ఏంజరిగిందంటే..
1979లో ఇరాన్ విప్లవం తర్వాత టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విద్యార్థులు.. మొత్తం 52 మంది అమెరికన్లను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించేందుకు అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 1980 ఏప్రిల్ 24న ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పేరుతో అత్యంత రహస్యంగా సైనిక చర్య చేపట్టారు. అత్యంత నిపుణులైన కమాండోలు, ఆధునిక హెలికాప్టర్లతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల వల్ల ఇది పెను విషాదంగా మారింది.
ముంచెత్తిన ఇసుక తుపాను..
ఇరాన్ ఎడారిలో ఊహించని రీతిలో చెలరేగిన భారీ ఇసుక తుపాను (హబూబ్) కారణంగా హెలికాప్టర్ల విజిబిలిటి దెబ్బతింది. మరోవైపు, మూడు హెలికాప్టర్లు సాంకేతిక లోపాలతో మొరాయించాయి. దీంతో మిషన్‌ను రద్దు చేసుకుని వెనుదిరుగుతున్న సమయంలో ఓ హెలికాప్టర్, ఇంధనం నింపుతున్న రవాణా విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో భారీ పేలుడు సంభవించి 8 మంది అమెరికా సైనికులు అక్కడికక్కడే మరణించారు. ప్రాణభయంతో మిగిలిన అమెరికా దళాలు తమ సహచరుల మృతదేహాలను, విమానాలను, కీలకమైన రహస్య పత్రాలను సైతం అక్కడే వదిలేసి పరారయ్యాయి.
అగ్రరాజ్యం పరువు తీసిన ఆపరేషన్..
ఈ వైఫల్యం అగ్రరాజ్యం సైనిక సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సందేహాలను రేకెత్తించింది. జిమ్మీ కార్టర్ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసి, ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఇరాన్ మాత్రం దీనిని దైవకృపగా భావిస్తూ, అమెరికా బలహీనతకు నిదర్శనంగా ఇప్పటికీ ప్రస్తావిస్తుంటుంది. తాజాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అదే ‘తబాస్ ఎడారి’ వైఫల్యాన్ని గుర్తుచేస్తూ, మరోసారి అలాంటి తప్పు చేయవద్దని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది. ట్రంప్ వ్యాఖ్యలను ‘పిచ్చివాడి మాటలు’గా కొట్టిపారేసింది.