మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత
- లక్షలాది ఇళ్లను కూల్చివేసి, 3 వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నారని ఆరోపణ
- కార్పొరేట్ కంపెనీలకు ఆ భూమిని అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న కేటీఆర్
- అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం
తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి బెదిరింపులు అలవాటుగా మారాయని, కానీ ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడానికి ఖజానాలో ఒక్క రూపాయి లేదని చెబుతున్న ముఖ్యమంత్రి, మూసీ ప్రాజెక్టు కోసం మాత్రం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే, శివతాండవం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరమని అన్నారు. ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.