ఇరాన్ దగ్గర అసలు అణుబాంబే లేదు.. ట్రంప్ సర్కారుపై బాంబు పేల్చిన జో కెంట్
- యుద్ధం కోసమే ట్రంప్ కట్టుకథలు ప్రచారం చేశారని ఆరోపణ
- తప్పుడు సమాచారంతో సైనికులు, పౌరుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన
- కౌంటర్ టెర్రరిజం చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కెంట్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ పై అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ కెంట్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైట్‌హౌస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. "ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసిందన్న నిఘా వర్గాల నివేదికలు తప్పు. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఆ దేశం అణుబాంబుకు దరిదాపుల్లో కూడా లేదు" అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఇరాన్లో పాలన మార్పు లక్ష్యంగానే అమెరికా ప్రభుత్వం ఈ అబద్ధాలను ప్రచారం చేస్తోందని కెంట్ ఆరోపించారు.
యుద్ధాన్ని సమర్థించుకోవడం కోసమే ఇరాన్ ముప్పును భూతద్దంలో చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ తప్పుడు సమాచారం వల్ల అమెరికా సైనికులు, పశ్చిమాసియాలో అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కెంట్‌ను ‘బలహీనమైన అధికారి’గా అభివర్ణించిన ట్రంప్.. ఈ తాజా ఆరోపణలపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముంది.
మరోవైపు, తమది శాంతియుత అణు కార్యక్రమమేనని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఇప్పుడు కీలక అధికారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇరాన్ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ఈ వ్యవహారంపై విచారణ జరిపే సూచనలు కనిపిస్తున్నాయి.