Bharateeyudu 2: సుభాస్కరన్ పెట్టుకున్న నమ్మకమే ఈ చిత్రం: భారతీయుడు-2 ఆడియో లాంచ్ లో కమల్ హాసన్

Kamal Haasan speech in Indian 2 audio launch

  • కమల్ హాసన్, శంకర్ కలయికలో భారతీయుడు-2
  • జులై 12న వరల్డ్ వైడ్ రిలీజ్
  • చెన్నైలో గ్రాండ్ గా ఆడియో లాంచ్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. 

జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏఎం రత్నం, 'ఏషియన్ సినిమాస్' సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. 

ఆయన అన్న ఒక్క మాటతో, ఎంతో నమ్మకంతో ఆ సినిమా చేశాను: కమల్ హాసన్

ఇక ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘28 ఏళ్ల క్రితం ఇండియన్ (భారతీయుడు) సినిమా టైంలో వాస్తవానికి నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి... మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. 

ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏఎం రత్నం గారు ఆ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్-2 చేశాం. 

ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆయన మాకు అండగా నిలిచారు. ఈ ప్రాజెక్టును ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ చిత్రం. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేం చేశాం. 

మా చిత్రానికి సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి థాంక్స్. కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇండియన్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. 

మొదటి రోజు కమల్ గెటప్ చూసి అంతా షాకయ్యాం: శంకర్

ఇండియన్ టైంలోనే కమల్ హాసన్ గారు సీక్వెల్ తీద్దామని అన్నారు. కానీ అప్పుడు నా వద్ద సరైన కథ లేదు. చాలా ఏళ్లకు పేపర్స్‌లో లంచం వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నాను. కానీ అప్పుడు నేను, కమల్ హాసన్ గారు వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదు. 

రోబో 2.0 తరువాత ఈ కథ రాసుకున్నాను. అలా ఇండియన్-2 మొదలైంది. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యాం. 28 ఏళ్ల క్రితం ఎలా అనిపించిందో... అప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. 

ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు... చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదు. ఆయన 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ఎన్ని సినిమాలు  చేసినా ఆనందంగానే ఉంటుంది. 

ఎస్ జే సూర్య డిఫరెంట్ రోల్ చేశారు. సముద్రఖని, సిద్దార్థ్, బాబీ సింహా చక్కటి పాత్రలు పోషించారు. మనోబాలా, వివేక్ గారు మన మధ్య లేరు. కానీ ఈ సినిమాలో వాళ్ల పాత్రలు మనతో గుర్తుండిపోతాయి. కాజల్, రకుల్ అద్భుతంగా నటించారు. 

ఇండియన్ 2 వేరే నిర్మాతతో సినిమా చేయాలి. కానీ లైకా నుంచి సుభాస్కరన్ గారు ఫోన్ చేసి ‘నేను నిర్మిస్తాను.. నాకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టం. నేనే నిర్మిస్తాను’ అని అన్నారు. మాకు ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఆయన ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మాకు అండగా నిలిచిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ఇండియన్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇండియన్ 2 అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను.

కమల్ హాసన్ లోని ప్రతి అణువు కూడా నటిస్తుంది: బ్రహ్మానందం

శంకర్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్. ఇప్పటికీ అదే డెడికేషన్, సిన్సియార్టీతో సినిమా తీశారు. ఇండియన్ సినిమా ఎంత బాగుంటుందో.. ఈ సీక్వెల్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనలోని ప్రతీ అణువు నటిస్తుంటుంది. ఆయనతో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఇండియన్ 2 పెద్ద విజయాన్ని సాధిస్తుంది.

తెలుగులో హక్కులు దక్కించుకున్న ఏషియన్ సురేశ్ ఎంటర్టయిన్ మెంట్స్

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

  • Loading...

More Telugu News