Laya: చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు .. ఒకసారి ఏం జరిగిందంటే..: లయ
- హీరోయిన్ గా మెప్పించిన లయ
- వివాహం తరువాత సినిమాలకి దూరం
- తాను షూటింగుకి ఎగ్గొట్టడం గురించిన ప్రస్తావన
- తనపై గాసిప్స్ పట్ల అసహనం
కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను కాజేసిన కథానాయికగా లయ కనిపిస్తుంది. వివాహం తరువాత నటనకు దూరంగా ఉన్న లయ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను చాలా సాఫ్ట్. అందువలన చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు. మిగతా వాళ్లందరికీ డబ్బులు ఇచ్చేసి .. నాకు మాత్రం ఇచ్చేవారు కాదు. 'మీరు గట్టిగా అడగండి' అని మిగతావారు చెప్పేవారు" అన్నారు.
"ఒకసారి నేను షూటింగుకి రెడీ అయ్యాను. వాళ్లు డబ్బుల విషయాల్లో ఇబ్బంది పెడుతుండటం వలన, షూటింగుకి రానని చెప్పేశాను. వేరే ఊరు నుంచి మా ఫాదర్ కాల్ చేస్తే, మా అమ్మగారు ఆయనకి విషయం చెప్పింది. అంతే.. ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది. 'డబ్బులు అడగడంలో తప్పులేదు .. కానీ అందుకోసం పని మానేయడం తప్పు' అని ఆయన క్లాస్ పీకారు. అప్పటి నుంచి ఇంకెప్పుడూ అలా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.
"కొంతమందేమో డబ్బులు అడిగితే నెక్స్ట్ ప్రాజెక్టులో చూద్దాం అనేవారు. ఆ తరువాత ప్రాజెక్టులో మనల్ని కాకుండా వేరే వారిని తీసుకుంటారు. మళ్లీ వాళ్లకి డబ్బులు ఇస్తారు. అలాంటప్పుడు మాత్రం కాస్త బాధకలిగేది. ఇంకా నాపై లేనిపోనివి రాస్తూ, యూ ట్యూబ్ లో ఏవేవో పోస్టులు పెడుతున్నారు. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు" అన్నారు.