విజయనగరం జడ్పీ రేసులో బొత్స సత్యనారాయణ కూతురు అనూష?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయనగరం జడ్పీ రేసులో బొత్స సత్యనారాయణ కూతురు అనూష?

Botsa Anusha in Vizianagaram ZP race
  • టీడీపీలోకి వెళ్లిన మేనల్లుడు చిన్న శ్రీనుకు చెక్ పెట్టే వ్యూహం
  • బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మారిన సమీకరణాలు
  • చిన్న శ్రీను కూడా తన కుమార్తెను బరిలోకి దించనున్నట్లు ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం కోసం వైసీపీ కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కి రాజకీయంగా చెక్ పెట్టేందుకు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె బొత్స అనూషను రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఈసారి బీసీ (మహిళ)కు రిజర్వ్ చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ సమీకరణాలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో వైసీపీ తరఫున జెడ్పీ చైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను, ఇప్పుడు టీడీపీ కూటమి తరఫున తన కుమార్తె సిరి సహస్రను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్న శ్రీను దూకుడుకు కళ్లెం వేయాలంటే, బొత్స కుటుంబం నుంచే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వృత్తిరీత్యా డాక్టర్ అయిన బొత్స అనూషను చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం బొత్స అనూష భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆమె విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ బరిలో నిలవడం ఖాయమని చెబుతున్నారు. ఇదే జరిగితే విజయనగరం జెడ్పీ ఎన్నికల పోరు, బొత్స కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష పోరుగా మారి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించడం ఖాయం.
Advertisement
Botsa Anusha
Vizianagaram ZP Elections
Botsa Satyanarayana
Majji Srinivasa Rao
YSRCP TDP Politics
Andhra Pradesh Local Body Elections

More Telugu News