పెమ్మసాని పొలిటికల్ హీరో, నాదెండ్ల బెస్ట్ మినిస్టర్.. సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం

పెమ్మసాని పొలిటికల్ హీరో, నాదెండ్ల బెస్ట్ మినిస్టర్.. సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం

Chandrababu Naidu Praises Pemmasani as Political Hero and Nadendla as Best Minister
  • గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
  • పెమ్మసానిని పొలిటికల్ హీరోగా అభివర్ణించిన ముఖ్యమంత్రి
  • ప్రజలతో మమేకమై అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడిన చంద్రబాబు
  • ధరల నియంత్రణలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థంగా పనిచేస్తున్నారన్న సీఎం
  • పేదల కోసం పనిచేసే మంత్రులుగా ఇరువురిపై కితాబు
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) ఇళ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ లపై ప్రశంసల వర్షం కురిపించారు. వారి పనితీరును కొనియాడుతూ, కూటమి ప్రభుత్వంలో వారి పాత్రను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఒకప్పుడు బుర్రిపాలెం అనగానే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తొచ్చేవారు. ఇప్పుడు ఇక్కడికి మరో హీరో వచ్చారు. ఆయన సినిమా హీరో అయితే, మన పెమ్మసాని చంద్రశేఖర్ పొలిటికల్ హీరో" అని అభివర్ణించారు. పెమ్మసానిని ఎంపీగా ఎంపిక చేసినప్పుడు తనకు కొన్ని సందేహాలు కలిగాయని చంద్రబాబు బహిరంగంగా అంగీకరించారు. 

"ఎక్కువకాలం అమెరికాలో ఉన్న పెమ్మసాని, ఇక్కడి ప్రజలతో పట్టు సాధించగలరా? వారితో మమేకం అవుతారా? అని నేను మొదట అనుమానించాను. కానీ ఈరోజు ఆయన ప్రసంగాలు, ప్రజలతో కలిసిపోతున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక సామాన్యుడిలా ప్రజల్లో ఒకరిగా మారిపోయి, అందరి బాగోగులు చూసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళుతున్నారు" అని చంద్రబాబు కొనియాడారు. పెమ్మసాని ఆధ్వర్యంలో బుర్రిపాలెంలో చేపడుతున్న 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది దేశానికే ఆదర్శం కానుందని పేర్కొన్నారు.

అదేవిధంగా, జనసేన నాయకుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పనితీరును చంద్రబాబు ఎంతగానో మెచ్చుకున్నారు. "నాకు కేబినెట్‌లో మొదట గుర్తొచ్చేది నాదెండ్ల మనోహర్. నిత్యావసరాల ధరలు కొంచెం పెరిగినా, వెంటనే నాకు ఒక చీటీ పంపించి పరిస్థితిని వివరిస్తారు. ధరలను నియంత్రణలో ఉంచడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నామని చెబుతారు. పేద ప్రజలపై ధరల భారం పడకుండా అనునిత్యం పనిచేస్తున్న అత్యంత సమర్థవంతమైన మంత్రి మనోహర్" అని ప్రశంసించారు. ఆయన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన శాఖలను నిర్వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందున్నారని చంద్రబాబు తన ప్రసంగంలో స్పష్టం చేశారు. వారి పనితీరు కూటమి ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని ఆయన అన్నారు.
Advertisement
Chandrababu Naidu
Pemmasani Chandra Sekhar
Nadendla Manohar
Burripalem PMAY Housing
Andhra Pradesh Alliance Government
3D Printing Technology Houses

More Telugu News