బ్యాంకు మూసేస్తే పుట్టిన ఆలోచన... ఏటీఎం వెనుక ఆసక్తికర కథ!

బ్యాంకు మూసేస్తే పుట్టిన ఆలోచన... ఏటీఎం వెనుక ఆసక్తికర కథ!

The idea born when bank closed interesting story behind ATM invention
  • బ్యాంకు మూసేయడంతో వచ్చిన ఆలోచనే ఏటీఎం
  • చాక్లెట్ వెండింగ్ మెషిన్ స్ఫూర్తితో ఏటీఎం ఆవిష్కరణ
  • 1967లో లండన్‌లో బార్ల్కేస్ బ్యాంకు తొలి ఏటీఎం ఏర్పాటు
  • తొలినాళ్లలో ప్లాస్టిక్ కార్డులకు బదులు పేపర్ వోచర్లు వినియోగం
  • బ్యాంకింగ్ వేళలతో సంబంధం లేకుండా నగదు విత్ డ్రా సౌకర్యం
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన 'ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్' (ఏటీఎం) ఆవిష్కరణ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బ్యాంకు పనివేళలు ముగిసిన తర్వాత డబ్బు తీసుకోలేకపోయాననే ఒక వ్యక్తి అసహనమే ఈ అద్భుత ఆవిష్కరణకు దారితీసింది. 

ఆ వ్యక్తి స్కాట్లాండ్‌కు చెందిన ఆవిష్కర్త జాన్ షెపర్డ్-బ్యారన్. ఆయనకు ఎదురైన ఒక చిన్న అనుభవమే ప్రపంచ రిటైల్ బ్యాంకింగ్ స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేసింది.

1960వ దశకం మధ్యలో బ్యాంకులు పరిమిత గంటలు మాత్రమే పనిచేసేవి. శని, ఆదివారాలు వస్తే నగదు తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఆ రోజుల్లో నోట్ల తయారీ సంస్థ 'డీ లా రూ'లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న షెపర్డ్-బ్యారన్, ఒక శనివారం తన చెక్కును క్యాష్ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లారు. కానీ, అప్పటికే బ్యాంకు మూసేశారు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఎప్పుడైనా, ఎక్కడైనా మన డబ్బును మనమే తీసుకునేలా ఒక యంత్రం ఎందుకు ఉండకూడదు? అనే ఆలోచన ఆయన మదిలో మెదిలింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ఉండే చాక్లెట్ వెండింగ్ మెషిన్ల నుంచి స్ఫూర్తి పొంది, అలాంటిదే డబ్బు ఇచ్చే యంత్రాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.

తన ఆలోచనను బార్ల్కేస్ బ్యాంకుతో పంచుకోగా, వారు దీనికి అంగీకరించారు. షెపర్డ్-బ్యారన్ బృందం పగలు, రాత్రి కష్టపడి తొలి ఏటీఎం యంత్రాన్ని అభివృద్ధి చేసింది. 1967 జూన్ 27న లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో ఉన్న బార్ల్కేస్ బ్రాంచ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్ డిస్పెన్సర్‌ను ఆవిష్కరించారు. 

అయితే, ఇప్పటిలా అప్పట్లో ప్లాస్టిక్ కార్డులు లేవు. స్వల్పస్థాయి రేడియోధార్మిక పదార్థంతో కూడిన ప్రత్యేక పేపర్ వోచర్లను ఉపయోగించి డబ్బు విత్‌డ్రా చేసేవారు. దీని ద్వారా ఒకేసారి గరిష్ఠంగా 10 పౌండ్ల వరకు మాత్రమే తీసుకునే వీలుండేది.

ఈ యంత్రంతోనే వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్) విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. మొదట 6 అంకెల పిన్‌ను సూచించినా, తన భార్య సలహాతో నాలుగు అంకెలు అయితే సులభంగా గుర్తుంటాయని బ్యారన్ దానినే ఖరారు చేశారు. 

ఈ ఆవిష్కరణ తర్వాత బ్యాంకింగ్ వేళలతో సంబంధం లేకుండా వినియోగదారులు నగదు పొందే సౌలభ్యం ఏర్పడింది. కేవలం ఒక వ్యక్తికి ఎదురైన చిన్న అసౌకర్యం, ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
Advertisement
John Shepherd Barron
ATM History
Barclays Bank
Automated Teller Machine
First ATM London
Banking Innovation

More Telugu News