కాక్రోచ్ పార్టీ 48 గంటల అల్టిమేటం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పెరుగుతున్న ఒత్తిడి

కాక్రోచ్ పార్టీ 48 గంటల అల్టిమేటం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పెరుగుతున్న ఒత్తిడి

Gyanesh Kumar Resign within 48 hours Cockroach Party ultimatum to CEC
  • ఈసీలో విభేదాల వ్యవహారంతో రాజకీయ దుమారం
  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ 48 గంటల గడువు
  • రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరిక
  • రానున్న అసెంబ్లీ ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్‌
  • ఇప్పటికే విపక్షాల విమర్శల నేపథ్యంలో పెరిగిన ప్రాధాన్యం 
కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎస్‌ఐఆర్‌ సహా ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రచురించింది. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరాలు నమోదు చేసినట్లు ఆ కథనం పేర్కొంది. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై విపక్షాల విమర్శలు మరింత పెరిగాయి.

ఇప్పటికే కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కూడా రంగంలోకి దిగింది. జ్ఞానేశ్‌ కుమార్‌ 48 గంటల్లో రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా రాజీనామా చేయకపోతే ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.

ఈ క్రమంలో, సీజేపీ సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ తమ డిమాండ్లను వెల్లడించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాతో పాటు ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితాలను 2025 నాటి స్థాయికి పునరుద్ధరించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీ అధీనంలో ఉంచాలన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తుత చట్టాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

గతంలో నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కూడా సీజేపీ ఇలాంటి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వారి డిమాండ్లను నెరవేర్చింది. తాజాగా ఎన్నికల సంఘంపై ఆందోళనకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇక పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం జ్ఞానేశ్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌కు ముందు ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లో తాజా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విపక్షాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ కూడా సీఈసీ రాజీనామా డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు తాజా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం బలం చేకూర్చుతోందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా స్పందించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ హయాంలో ఇకపై ఎన్నికలు నిర్వహించకూడదనిడిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘంలోనే నిర్ణయాలపై అభ్యంతరాలు నమోదైనట్లు వచ్చిన సమాచారం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మరింత తీవ్రంగా స్పందించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషనర్లు నమోదు చేసిన అభ్యంతరాలపై సమగ్ర విచారణ జరగాలని కోరారు.

మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, రాతపూర్వక అభిప్రాయాలు నమోదు కావడం అంతర్గత చర్చల్లో సాధారణమేనని స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్‌తో పాటు గత ఏడాది తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇదే సమయంలో బీజేప విపక్షాల విమర్శలను తప్పుబట్టింది. ఎన్నికల కమిషనర్ల మధ్య చర్చలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ విషయంలో తుది నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని చెప్పారు.

దీంతో సీఈసీపై విపక్షాల విమర్శలు ఒకవైపు, ఎన్నికల సంఘం వివరణ మరోవైపు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సీజేపీ ఇచ్చిన 48 గంటల గడువు ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. గడువు పూర్తయ్యాక సీజేపీ ఎలాంటి కార్యాచరణ చేపడుతుంది? ఇతర విపక్ష పార్టీలు దానికి మద్దతు ఇస్తాయా? దేశవ్యాప్త ఆందోళనలకు ఈ అంశం దారితీస్తుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

Advertisement
Gyanesh Kumar
Cockroach Janata Party
Election Commission of India
CEC Resignation Demand
Abhijit Dipke
Indian Express Report

More Telugu News