యూట్యూబర్ నందన దంపతులపై ప్రజావాణిలో ఫిర్యాదు

యూట్యూబర్ నందన దంపతులపై ప్రజావాణిలో ఫిర్యాదు

YouTuber Nandana and husband face complaint at Prajavani for job fraud
  • యూట్యూబర్ నందన దంపతులపై ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు
  • యూకేలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపణ
  • ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు
  • నకిలీ పత్రాలతో వీసాలు ఇప్పించారని బాధితుల ఆవేదన
  • విషయాన్ని డీజీపీ, ఈడీ దృష్టికి తీసుకెళతామని అధికారుల హామీ
యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసగించినట్లు యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్‌లపై ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ మేరకు బాధితులు సోమవారం ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల కథనం ప్రకారం..
యూకే ప్రభుత్వం తమ కన్సల్టెన్సీకి ఉద్యోగులు నియామక ప్రక్రియ కోసం అనుమతులు మంజూరు చేసిందని నందన, మధుకర్ దంపతులు నమ్మబలికారు. ప్రధానంగా స్టూడెంట్, విజిటర్ వీసాలపై యూకేకు వెళ్లి, వీసా గడువు ముగియనున్న వారిని లక్ష్యంగా చేసుకుని వర్క్ వీసాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 95 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. అయితే, సదరు కన్సల్టెన్సీ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో యూకే ప్రభుత్వం తమపై కఠిన చర్యలు తీసుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని వారు వివరించారు.

సోమవారం బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో బాధితులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్‌పర్సన్, ప్రజావాణి ఇన్‌చార్జ్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, ఎన్నారై సలహా కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్‌లను కలిసి తమ సమస్యను విన్నవించారు. వారి నుంచి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు, ఈ ఉదంతాన్ని రాష్ట్ర డీజీపీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి తీసుకెళ్లి, పూర్తిస్థాయి దర్యాప్తునకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Nandana
YouTuber Nandana Job Fraud
UK Job Visa Scam
Prajavani Complaint Telangana
Madhukar Nandana Husband Fraud

More Telugu News