ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాంక్‌ నచ్చలేదా? ఇక స్టిక్కర్‌ తీసేయాల్సిన అవసరం లేదు!

ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాంక్‌ నచ్చలేదా? ఇక స్టిక్కర్‌ తీసేయాల్సిన అవసరం లేదు!

Dont like your FASTag bank No need to remove the sticker anymore
  • వన్‌ట్యాగ్‌తో ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాంక్‌ మార్చుకునే వెసులుబాటు
  • వాహనంపై ఉన్న స్టిక్కర్‌ మార్చాల్సిన అవసరం ఉండదు
  • ట్యాగ్‌ ఐడీ, వాహన వివరాలూ మారవు
  • టోల్‌ చెల్లింపులు ఎన్‌ఈటీసీ ద్వారానే జరుగుతాయి
  • పాత బ్యాలెన్స్‌ను పాత బ్యాంకే చూసుకుంటుంది
హైవేపై టోల్‌ గేటు దగ్గర ఆగకుండా వెళ్లిపోవడం ఇప్పుడు మనకు సాధారణమే. వాహనం ముందు అద్దానికి ఉన్న చిన్న ఫాస్ట్‌ట్యాగ్‌ స్టిక్కర్‌ స్కాన్‌ అవుతుంది.. ఖాతా నుంచి టోల్‌ డబ్బు కట్‌ అవుతుంది. కానీ ఫాస్ట్‌ట్యాగ్‌ జారీ చేసిన బ్యాంక్‌ సేవలు నచ్చకపోతే? ఇప్పటివరకు మరో బ్యాంకుకు మారాలంటే కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ తీసుకుని, పాతదాన్ని తొలగించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు వన్‌ట్యాగ్‌ సదుపాయం తీసుకొచ్చారు.

వన్‌ట్యాగ్‌ సింపుల్‌గా చెప్పాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్‌ మార్చకుండా దాన్ని జారీ చేసిన బ్యాంకును మార్చుకునే అవకాశం. అంటే మొబైల్‌ నంబర్‌ మార్చుకోకుండా నెట్‌వర్క్‌ మార్చుకున్నట్లన్నమాట.

స్టిక్కర్‌ మాత్రం అదే
బ్యాంక్‌ మార్చుకున్నా వాహనంపై ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ను తీసేయాల్సిన అవసరం లేదు. అదే స్టిక్కర్‌, అదే ట్యాగ్‌ ఐడీ కొనసాగుతాయి. వాహన రిజిస్ట్రేషన్‌ వివరాల్లోనూ మార్పు ఉండదు. బ్యాంక్‌ మార్పు మాత్రం వెనుక ఉన్న వ్యవస్థలో నమోదు అవుతుంది.

మరి బ్యాంక్‌ ఎలా మారుతుంది?
వన్‌ట్యాగ్‌ ద్వారా మరో ఫాస్ట్‌ట్యాగ్‌ జారీ చేసే బ్యాంకును ఎంచుకోవచ్చు. పోర్టింగ్‌ పూర్తయ్యాక కొత్త బ్యాంకు ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన ఖాతా, ఇతర సేవలను నిర్వహిస్తుంది. వాహనంపై ఉన్న ట్యాగ్‌ మాత్రం పాతదే ఉంటుంది.

ఇది మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌ మాదిరిగానే పనిచేస్తుంది. మన నంబర్‌ మారదు.. వెనుక సేవలు అందించే సంస్థ మాత్రమే మారుతుంది. ఇక్కడా అదే జరుగుతుంది.

టోల్‌ డబ్బు చెల్లింపు మాత్రం యథాతథం
బ్యాంక్‌ మారిందని టోల్‌ గేటు దగ్గర కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. లావాదేవీలు ఇప్పటిలాగే ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. వన్‌ట్యాగ్‌ను ఎన్‌హెచ్‌ఏఐ రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు.

పాత ఖాతాలోని డబ్బు సంగతేంటి?
ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. బ్యాంక్‌ మార్చుకున్న వెంటనే పాత ఫాస్ట్‌ట్యాగ్‌ ఖాతాలో ఉన్న డబ్బు కొత్త బ్యాంకుకు వెళ్లదు. మిగిలిన బ్యాలెన్స్‌, రీఫండ్‌లు, ఇంకా పూర్తికాని లావాదేవీలను పాత బ్యాంకే చూసుకుంటుంది. పోర్టింగ్‌ పూర్తయ్యాక కొత్త బ్యాంకు ద్వారా ఫాస్టాగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

అసలు వన్‌ట్యాగ్‌ ఎందుకు?
ఒక బ్యాంకు సేవలు నచ్చకపోయినా.. మరో బ్యాంకులో మెరుగైన సేవలు లభిస్తున్నాయని అనిపించినా.. ఫాస్ట్‌ట్యాగ్‌ మార్చుకోవడం గతంలో ఒక అదనపు పని. కొత్త ట్యాగ్‌ తీసుకోవాలి. పాతదాన్ని తొలగించాలి. కొత్తదాన్ని వాహనానికి అంటించాలి. వన్‌ట్యాగ్‌తో ఈ ప్రక్రియ సులభం కానుంది.

అంటే వాహనం మారదు.. ఫాస్ట్‌ట్యాగ్‌ స్టిక్కర్‌ మారదు.. టోల్‌ చెల్లింపు విధానం మారదు. అవసరమైతే బ్యాంక్‌ మాత్రమే మార్చుకోవచ్చు.

అత్యవసర సాయం మరింత వేగంగా
ఫాస్ట్‌ట్యాగ్‌ విషయంలోనే కాదు.. జాతీయ రహదారులపై అత్యవసర సేవల్లోనూ టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతున్నారు. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 1033 నేషనల్‌ హైవే హెల్ప్‌లైన్‌ను ఆధునికీకరించే ప్రణాళిక పరిశీలనలో ఉంది. ఇందులో ఏఐ, రియల్‌టైమ్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌, ఆటోమేటెడ్‌ డిస్పాచ్‌ వంటి సదుపాయాలను తీసుకురావాలని చూస్తున్నారు.

దీంతో హైవేపై ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి గురించి సమాచారం అందినప్పుడు.. ఘటన జరిగిన ప్రదేశాన్ని వేగంగా గుర్తించి, అవసరమైన సహాయక బృందాన్ని అక్కడికి పంపడం సులభమవుతుంది. అయితే కీలక నిర్ణయాల్లో మనుషుల పర్యవేక్షణ కొనసాగుతుంది.
Advertisement
FASTag
OneTag bank porting
NHAI Rajmargyatra app
FASTag sticker portability
National Highway toll collection
Highway helpline 1033

More Telugu News