జేడీ వాన్స్‌, జొహ్రాన్‌ మమ్దానీలతో భేటీకి రేవంత్‌ ప్లాన్‌? కేంద్రం అందుకే అనుమతి నిరాకరించిందా?

Revanth Reddy plan to meet JD Vance and Zohran Mamdani did Center deny permission for this reason
  • రేవంత్‌ రెడ్డి అమెరికా టూర్‌కు కేంద్ర అనుమతి నిరాకరణ
  • జేడీ వాన్స్‌, మమ్దానీలతో సమావేశానికి రేవంత్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం
  • ఆ విషయాన్ని విదేశాంగ శాఖకు వెల్లడించలేదని సమాచారం
  • అందుకే అనుమతి నిరాకరించినట్లు ఎన్‌డీటీవీ కథనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీలతో భేటీలు కూడా ఆయన పర్యటనలో భాగంగా ఉండటమే ఇందుకు కారణంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ఎన్డీటీవీ పేర్కొంది.

అమెరికా, బ్రిటన్‌ పర్యటనలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి  కార్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కోరింది. బ్రిటన్‌ పర్యటనకు అంగీకరించిన కేంద్రం అమెరికా టూర్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది.

అమెరికా పర్యటనలో జేడీ వాన్స్‌, జొహ్రాన్‌ మమ్దానీలతో భేటీలను ప్రతిపాదించినప్పటికీ.. ఈ కార్యక్రమాలను విదేశాంగ శాఖతో చర్చించలేదని, రాజకీయ అనుమతి ప్రక్రియలో భాగంగా సమాచారం పంపలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే ముందు ముఖ్యమంత్రి వంటి ప్రజాప్రతినిధుల ప్రతిపాదిత కార్యక్రమాలను విదేశాంగ శాఖ పరిశీలిస్తుంది. పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా కార్యక్రమాలు ఉన్నాయా? అన్నది పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తుంది.

ఈ అంశంపై శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందించారు. రేవంత్‌రెడ్డి బ్రిటన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చామని, అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలు కొన్ని ప్రమాణాలకు తగినవిగా ఉండాలని స్పష్టం చేశారు. అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణాలు సరిపోలకపోవడంతో అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు.

అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్య భారీగా ఉండటంతో రేవంత్‌రెడ్డి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికాలోని భారతీయ అమెరికన్లలో తెలుగు సమాజం సుమారు 14 శాతం ఉంటుందని, 12 లక్షలకు పైగా తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారని సమాచారం.

అయితే ఈ వ్యవహారం తెలంగాణలో రాజకీయ వివాదానికి దారితీసింది. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించి, బ్రిటన్‌ పర్యటనకు అనుమతి ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ నిర్ణయం రాజకీయ కక్షతో తీసుకున్నది కాదని, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నాయి.
Advertisement
Revanth Reddy
JD Vance
Zohran Mamdani
Ministry of External Affairs
Telangana CM US Visit
Central Government Permission

More Telugu News