ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశం.. ఐస్‌లాండ్‌ రహస్యం ఏంటి?

Iceland Secret of the Most Peaceful Country in the World
  • నేరాల సంఖ్య చాలా తక్కువ
  • శాశ్వత సైన్యం లేదు
  • స్వచ్ఛమైన గాలి, నీరు
  • ప్రజల్లో బలమైన నమ్మకం
  • కుటుంబాలకు అత్యంత సురక్షితం
ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా గత 19 ఏళ్లుగా 'అత్యంత ప్రశాంత దేశం' అనే గుర్తింపును మాత్రం ఒక్క దేశమే నిలబెట్టుకుంటోంది. అదే ఐస్‌లాండ్‌. నేరాలు తక్కువగా ఉండటం, ప్రజల మధ్య బలమైన నమ్మకం, సహజ వాతావరణం, సమానత్వానికి పెద్దపీట వేయడం లాంటి అంశాలు ఈ దేశాన్ని ఏళ్ల తరబడి అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి.

ఐస్‌లాండ్‌లో శాశ్వత సైన్యం ఉండదు. నాటోలో సభ్యదేశమైనా రక్షణ కోసం కోస్ట్‌గార్డ్‌, ప్రత్యేక బృందాలపైనే ఆధారపడుతుంది. దేశంలో నేరాల సంఖ్య చాలా తక్కువ. పోలీసులు కూడా సాధారణ విధుల్లో ఆయుధాలు దగ్గర ఉంచుకోరు. ప్రజల్లో భయాందోళనలు కాకుండా పరస్పర నమ్మకం ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన గాలి ఇక్కడ లభిస్తుంది. కుళాయి నీరు కూడా కరిగిన మంచు నుంచి రావడంతో నేరుగా తాగవచ్చు. ఆరోగ్యానికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. చిన్నారులను బేబీ స్ట్రోలర్‌లో బయట నిద్రపుచ్చేంత భద్రత అక్కడ ఉండటం ఈ దేశ ప్రత్యేకతను చూపిస్తుంది.

కుటుంబాలకు అనువైన దేశంగా కూడా ఐస్‌లాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. మహిళలు, ఎల్‌జీబీటీక్యూ వర్గాలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. తక్కువ జనాభా, ఒకరికొకరు సహకరించుకునే స్వభావం కూడా సామాజిక ఐక్యతను పెంచుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే వ్యవస్థలు ప్రజల్లో మరింత భరోసా కల్పిస్తున్నాయి.

ప్రపంచ దేశాల ప్రశాంతతను అంచనా వేసే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌’ రూపొందించే గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌లో ఐస్‌లాండ్‌ వరుసగా 19 ఏళ్లుగా తొలి స్థానంలో నిలుస్తోంది. భద్రత, సామాజిక ప్రశాంతత, సైనికీకరణ స్థాయి, ఘర్షణలు వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు.
Advertisement
Iceland
Global Peace Index
World Most Peaceful Country
Iceland Safety Secrets
Institute for Economics and Peace
Iceland Social Equality

More Telugu News