విజయ్ కి మళ్లీ మద్దతు ప్రకటించిన ఐయూఎంఎల్... 120కి పెరిగిన టీవీకే బలం
- తమిళ రాజకీయాల్లో వీడిన ఉత్కంఠ... విజయ్ సీఎం పీఠం ఖరారు
- ఒకరోజు వ్యవధిలో మాట మార్చి మళ్లీ మద్దతిచ్చిన పార్టీ
- ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలవనున్న విజయ్
ఐయూఎంఎల్ శాసనసభా పక్ష నేత ఎస్ఎస్‌బీ సయ్యద్ ఫరూక్ బాషా, ఉప నేత ఏఎం షాజహాన్... గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి తమ మద్దతు లేఖను అందజేశారు. ఐయూఎంఎల్‌తో పాటు విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజా పరిణామాలతో టీవీకే కూటమి బలం 120కి చేరింది. ఇందులో టీవీకేకు 107 మంది, కాంగ్రెస్‌కు 5, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌లకు తలా ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, విజయ్ ఒక స్థానాన్ని వదులుకోవడంతో ఆ పార్టీ బలం 107కి తగ్గింది.
కాగా, గవర్నర్ కేరళ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, తమకు మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలతో విజయ్ నేడు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. త్వరలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున మీడియాకు తెలిపారు.