ఆసుపత్రిలో దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
- ఇటీవల పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణపై దాడి
- దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న మంత్రి కొండా సురేఖ
- కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యపై ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకున్న మంత్రి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సత్యనారాయణ గాయపడిన శరీరం విధ్వంసానికి గురైన అడవిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు, నీటి హక్కులకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిపై దాడి చేయడం మానవ మనుగడపై దాడి చేయడంతో సమానమని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై సత్యనారాయణ చేసిన పోరాటాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలతో ఢిల్లీ వరకు వెళ్లి, అప్పటి ప్రధాని వాజ్‌పేయికి సమస్య తీవ్రతను వివరించారని కొనియాడారు.
దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎస్పీ నరసింహను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సత్యనారాయణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన సృష్టించిన 70 ఎకరాల అడవి పరిరక్షణకు వన మహోత్సవం నిధుల నుంచి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సత్యనారాయణను స్ఫూర్తిగా తీసుకుని, ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.