పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో!
- బలూచిస్థాన్‌లో భారీ విధ్వంసం.. క్వెట్టాకు నిలిచిన గ్యాస్ సరఫరా
- ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్యే అంటున్న పోలీసులు
- పైప్‌లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ తో పేల్చివేత!
సూయి సదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్ జీసీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో 18 అంగుళాల వ్యాసం కలిగిన ప్రధాన పైప్‌లైన్ ధ్వంసమైంది. ఫలితంగా క్వెట్టా, మాస్తుంగ్, కలాత్, పిషిన్, జియారత్ వంటి ఐదుకు పైగా జిల్లాల్లో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్య అని ప్రాథమికంగా నిర్ధారించింది. పైప్‌లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, మంగళవారం ఉదయం నుంచి మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. సరఫరా పునరుద్ధరించడానికి దాదాపు 12 నుంచి 24 గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, గతంలోనూ ప్రభుత్వ ఆస్తులు, ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకున్న బలూచ్ వేర్పాటువాద గ్రూపుల పనే అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.