బీజింగ్ మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. జనంపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి.. వీడియో ఇదిగో!
- రద్దీగా ఉండే మార్కెట్‌లో జనంపైకి వాహనాన్ని నడిపిన దుండగుడు
- ఇది ఉద్దేశపూర్వక దాడేనని స్పష్టం చేస్తున్న వీడియోలు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వెల్లడికాని కారణం
శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు పసుపు రంగు బుల్‌డోజర్‌తో మార్కెట్ లోపలికి ప్రవేశించాడు. తొలుత భద్రతా చెక్ పోస్టును బద్దలుకొట్టి, నేరుగా జనంపైకి వాహనాన్ని నడిపాడు. దుకాణాలను నేలమట్టం చేస్తూ, మనుషులను తోక్కిస్తూ ముందుకు సాగాడు.
ఈ దాడికి పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతను ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో కనీసం 8 మంది మరణించి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, మృతుల సంఖ్యపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.