రష్యా కీలక ఓడరేవుపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిన ఇంధన ఎగుమతులు
- రష్యాలోని ఉస్త్-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి
- బాల్టిక్ తీరంలోని కీలక గ్యాస్ టెర్మినల్‌ను లక్ష్యంగా చేసుకున్న డ్రోన్లు
- ఇది ఉగ్రచర్యగా అభివర్ణించిన రష్యా, ప్రతీకారం తప్పదని హెచ్చరిక
సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న ఉస్త్-లుగా పోర్టు రష్యా ఇంధన ఎగుమతులకు అత్యంత కీలకమైన కేంద్రం. ఐరోపా, ఆసియా దేశాలకు ఇక్కడి నుంచే అధిక మొత్తంలో చమురు, గ్యాస్ సరఫరా అవుతాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన సుదూర శ్రేణి డ్రోన్లు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని, నేరుగా గ్యాస్ నిల్వ ట్యాంకర్లను ఢీకొట్టాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించి, కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రష్యా యుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ గత కొంతకాలంగా ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. తాజా దాడిలో చమురు శుద్ధి యంత్రాలు (ఫ్రాక్షనేషన్ టవర్లు) దెబ్బతినడంతో రష్యా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ దాడిని రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది. కొన్ని డ్రోన్లను కూల్చివేశామని, అయితే మరికొన్ని లక్ష్యాన్ని ఛేదించాయని తెలిపింది. దీనిని ఒక 'ఉగ్రవాద చర్య'గా అభివర్ణించిన రష్యా, తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఉక్రెయిన్‌ను హెచ్చరించింది.