త్రిషతో బంధం నుంచి బయటపడితేనే...!: విజయ్‌పై బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు... మండిపడిన కనిమొళి
- విజయ్ మొదట ఇల్లు దాటి బయటకు రావాలన్న నైనార్ నాగేంద్రన్
- రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచన
- వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడం సరికాదన్న కనిమొళి
విజయ్‌ని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ తన పార్టీకి, డీఎంకేకు మధ్యే ఉంటుందని, బీజేపీ వంటి పార్టీలు రేసులో లేవని విజయ్ ఇటీవల బహిరంగసభలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై నాగేంద్రన్ స్పందిస్తూ, విజయ్‌కు రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో డ్యాన్సులు వేసుకోవడానికే పరిమితమని చురక అంటించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.
విజయ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని టీవీకే నాయకులు మండిపడ్డారు. అధికార డీఎంకే పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించింది. కనిమొళి 'ఎక్స్' వేదికగా బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలోని మహిళా నాయకులు నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు.