ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీని చంపడమే యుద్ధానికి సరైన ముగింపు: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఖొమైనీని చంపితే యుద్ధం ముగుస్తుందన్న నెతన్యాహు
- ఈ చర్యతో పరిస్థితి తీవ్రతరం కాదని వ్యాఖ్య
- ఇరాన్ తమను అణుయుద్ధం అంచుకు తీసుకొస్తోందన్న నెతన్యాహు
ఖొమైనీని హతమార్చడం వల్ల వివాదం ముగిసిపోతుందని, మరింత తీవ్రతరం కాదని గట్టిగా విశ్వసిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఇరాన్ దుందుడుకు చర్యలను నిరోధించడానికి, దుష్ట శక్తులను ఎదుర్కోవడానికే ఇజ్రాయెల్ ఈ చర్యలు తీసుకుంటోందని ఆయన నొక్కిచెప్పారు.
అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఖొమైనీని చంపేందుకు ఇజ్రాయెల్ వేసిన ప్రణాళికను ట్రంప్ వీటో చేశారన్న వార్తలపై నెతన్యాహు స్పందించారు. "ఇది సంఘర్షణను పెంచదు, ముగిస్తుంది" అని ఆయన అన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమవుతుందన్న ఆందోళనతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని కథనాలు వస్తున్నాయి.
"ఇరాన్ కోరుకునేది 'శాశ్వత యుద్ధం', వారు మమ్మల్ని అణుయుద్ధం అంచుకు తీసుకువస్తున్నారు" అని నెతన్యాహు పేర్కొన్నారు. "వాస్తవానికి, ఇజ్రాయెల్ చేస్తున్నది దీనిని నివారించడమే. ఈ దురాక్రమణకు ముగింపు పలకడమే. దుష్ట శక్తులను ఎదుర్కోవడం ద్వారానే మనం ఇది చేయగలం" అని ఆయన వ్యాఖ్యానించారు.