లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్సే కాదు... ఏపీలో వైసీపీదీ అదే పరిస్థితి: బాల్క సుమన్
- రెండు కూటముల మధ్య పోటీగానే దేశ ప్రజలు చూశారన్న సుమన్
- ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, యూపీలో బీఎస్పీ కూడా ఏ కూటమిలో లేవని వెల్లడి
- పేరుకే ప్రజా పాలన... కానీ ప్రతీకార పాలన సాగిస్తున్నారని ఆగ్రహం
పగ, ప్రతీకార పాలన సాగిస్తున్నారు
తెలంగాణలో పేరుకే ప్రజాపాలన అంటున్నారని... కానీ పగలతో, ప్రతీకారంతో కూడిన పాలనను సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎంతసేపూ కేసీఆర్‌పై విషం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్వేషాన్ని రగిల్చే కుట్ర తప్ప మరొకటి లేదన్నారు. ప్రజలు అవకాశమిచ్చినందుకు ఏం చేద్దామనే ఆలోచన వారికి ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇందుకు పాఠ్యపుస్తకాలను వెనక్కి తెప్పించడమే నిదర్శనమన్నారు.
పాఠ్యపుస్తకాలపై నాటి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డిల పేర్లు ఉన్నందుకు వాటిని వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక స్కూల్ పుస్తకాలపై జయలలిత ఫొటో ఉంటే ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదని గుర్తు చేశారు. ఒకవేళ కేసీఆర్ ఫొటో ఉండటం ఇబ్బందికరమైతే వేసవికాలంలోనే సమీక్ష నిర్వహించవలసి ఉండాల్సిందన్నారు. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక విద్యార్థుల్ని, పిల్లల్ని ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పట్టపగలు హత్య జరిగిందని... ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో పసిపాపను తీసుకెళ్లి అత్యాచారం చేశారని, హైదరాబాద్‌లో గంజాయి మూకలు స్వైరవిహారం చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారన్నారు. గంజాయి మూకల స్వైరవిహారం, హత్యలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో రేవంత్ రెడ్డి ఈ విశ్వనగరాన్ని కాస్తా విషాద నగరంగా చేశారని విమర్శించారు.