కాంగ్రెస్ గూండాల్లారా ఖబడ్దార్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక
- బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో ట్విట్టర్ లో వార్నింగ్
- మంత్రి జూపల్లి అండతో దాడులకు పాల్పడితే ఊరుకోబోమని వెల్లడి
- నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉందంటూ డీజీపీకి ఫిర్యాదు
కాంగ్రెస్ ప్రతీకార పాలన..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రతీకార పాలన చేస్తోందని ఆర్ఎస్పీ మండిపడ్డారు. మంత్రుల అండ చూసుకుని దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే తమ నాయకులపై వరుస హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులతో కొంతమంది స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ వారిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్ , అచ్చంపేట నియోజక వర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలని, ప్రాణహాని ఉన్న బీఆరెస్ సహా ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.