రిషిగంగ వద్ద పునఃప్రారంభమైన సహాయక చర్యలు
- ఉత్తరాఖండ్ లో విలయం
- తపోవన్ ప్రాజెక్టుపై విరుచుకుపడిన ధౌలిగంగా నది
- సొరంగంలో చిక్కుకుపోయిన 35 మంది
- సొరంగాన్ని కప్పేసిన బురద
- నదిలో నీటిమట్టం పెరగడంతో నిలిచిన సహాయక చర్యలు
ఇక్కడ ఓ సొరంగంలో 35 మంది వరకు చిక్కుకుపోగా, వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరద కారణంగా కొట్టుకొచ్చిన బురద ఈ సొరంగాన్ని కప్పేసింది. దాంతో ఆ బురద మట్టికి రంధ్రాలు చేసి ఆక్సిజన్ పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడి ధౌలిగంగా నది మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో అధికారుల చర్యలు ముందుకు సాగలేదు.
ఈ సొరంగం పొడవు ఒకటిన్నర కిలోమీటర్లు కాగా, 120 మీటర్ల మేర పూడిక తీయగలిగారు. బురదమట్టి క్రమేపీ గట్టిపడడంతో సమస్యాత్మకంగా మారింది. కాగా, ఈ వరద కారణంగా గల్లంతైన వారిలో 34 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 172 మంది జాడ తెలియరాలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.