ఒక స్టార్ హీరోకి ఎంతటి క్రేజ్ ఉంటుందో, దర్శకుడిగా అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నారు లోకేశ్ కనగరాజ్. ఆయన కథానాయకుడిగా రూపొందిన తొలి సినిమానే 'డీసీ'. గతంలో 'సానికాయుధం' వంటి విభిన్నమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన సినిమా ఇది. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీ నుంచి ఐదు భాషల్లో 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

దేవదాస్ (లోకేశ్ కనగరాజ్) సెబాస్టియన్ .. కిట్టూ .. నరసింహన్ .. నేరస్థులు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే వీళ్లందరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. బయటికి వచ్చిన తరువాత ఒక గ్యాంగ్ గా ఏర్పడి దొంగతనాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ప్రభుత్వానికి సంబంధించిన ఆయుధాలు తరలించబడుతూ ఉండగా దారి కాసి కొట్టేస్తారు. ఆ సమయంలోనే వీళ్ల చేతిలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. దాంతో దాస్ గ్యాంగ్ పై పోలీస్ గట్టి నిఘా పెడుతుంది. ఆ ప్రదేశంలో ఒక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తుంది. 

 ఒక రైతు తన కొడుకును పట్నంలో చదివించడం కోసం పొలం అమ్మేస్తాడు. అలా వచ్చిన 7 లక్షల రూపాయలతో ఆ ప్రదేశం మీదుగా వెళుతుంటాడు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు ఆ రైతు దగ్గర డబ్బును నొక్కేసి అతనిని చంపేస్తారు. ఈ విషయాన్ని అతని భార్య పైఅధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోరు. దాంతో ఆమె ఈ విషయాన్ని దాస్ తో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రైతు డబ్బులను పోలీసుల దగ్గర నుంచి తీసుకుని ఆమె కి ఇచ్చేయాలని దాస్ భావిస్తాడు. 
        
ఒక హోటల్లో పాటలు పాడే పార్వతి ( సంజనా కృష్ణమూర్తి)తో దాస్ ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే పోలీసులకు .. దాస్ కి కాల్పులు జరుగుతున్న సమయంలో ఆమె చనిపోతుంది. అక్కడి నుంచి తప్పించుకున్న దాస్ కి చంద్ర (వామికా గబ్బి) పరిచయమవుతుంది. ఆమె గతం తెలుసుకున్న దాస్ ఆమెను అక్కడి నుంచి బయటికి తీసుకురావాలనుకుంటాడు. డబ్బు కోసం దాస్ తిరుగుతున్నాడని తెలుకున్న ఆమె, అతనికి డబ్బు సర్దుబాటు చేయాలనుకుంటుంది. 

అసలు దాస్ గతం ఏమిటి? అతను ఎందుకు జైలుకు వెళతాడు? చంద్ర ఎలాంటి పరిస్థితులలో వేశ్యగా మారుతుంది? ఆమె కారణంగా దాస్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? రైతు కోల్పోయిన డబ్బును తిరిగి అతని భార్యకి చేర్చడం కోసం దాస్ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.

ప్రతి హంతకుడి వెనుక అతను అలా మారడానికి ఒక బలమైన కారణం కనిపిస్తుంది. అలాగే ప్రతి వేశ్య వెనుక ఒక కన్నీటి కథ వినిపిస్తుంది. అలాంటి ఒక హంతకుడు .. ఒక వేశ్య చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఎలాంటి పరిస్థితులలో ఈ ఇద్దరూ కలుసుకున్నారు .. ఇద్దరూ కలుసుకున్న తరువాత వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి .. వాటిని వాళ్లు ఎలా అధిగమిస్తారు .. అనే అంశాలు ఈ కథలో చోటుచేసుకుంటాయి. 

సాధారణంగా హంతకుడినిగానీ .. వేశ్యను గాని సానుభూతి కోణంలో అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. ఆవేశంలో తొందరపడి హత్య చేసి ఉంటారు .. కష్టపడి పనిచేయడం ఇష్టం లేనివారు వేశ్యగా మారతారని అనుకుంటారు. అయితే ఈ కథలో ఇద్దరు పాత్రలకు సంబంధించిన వ్యక్తిత్వాలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మానవీయ కోణంలో ప్రేక్షకులు ఆ పాత్రలను గురించిన ఆలోచన చేసేలా ఉంటాయి. 

నమ్మినవారి కోసం చివరివరకూ నిలబడటం అనేది దాస్ పాత్ర వైపు నుంచి కనిపిస్తే, అలా తన కోసం నిలబడినవారిని కడవరకూ  కాపాడుకోవడమనేది చంద్ర పాత్ర వైపు నుంచి కనిపిస్తుంది. పరిస్థితులు తప్పు చేయించినా .. తప్పుడు మార్గంలో నడిపించినా మానవత్వాన్ని మరిచిపోకపోవడం ఈ పాత్రల గొప్పతనంగా కనిపిస్తుంది.  తుపాకులు .. కత్తులు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగపడతాయి. స్నేహం - ప్రేమ మాత్రమే ఆత్మ సంతృప్తిని ఇవ్వగలుగుతాయని నిరూపించిన సినిమా ఇది. 
  
దాస్ గ్యాంగ్ ఆయుధాలను కాజేయడం .. డబ్బు కోసం రైతును పోలీసులే హత్య చేయడం వంటి ఆరంభ సన్నివేశాలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ తరువాత సన్నివేశాలు కాస్త రొటీన్ గా అనిపించినప్పటికీ, ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి కథా బలం పెరుగుతూ వెళుతుంది. యాక్షన్ వెనకున్న బలమైన ఎమోషన్ కనెక్ట్ అవుతూ వస్తుంది. ఓ హంతకుడు .. ఓ వేశ్య .. ఓ అమాయకుడైన రైతు .. పోలీస్ డిపార్ట్ మెంట్ .. ఈ నాలుగు ట్రాకులను కలుపుతూ ఈ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది. 

హీరోగా ఇది మొదటి సినిమానే అయినప్పటికీ లోకేశ్ కనగరాజ్ బాగా చేశాడు. ఇక సంజనా కృష్ణమూర్తి చాలా అందంగా .. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వామికా గబ్బి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకుంటుంది. కళానిధి మారన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖేశ్ ఫొటోగ్రఫీ .. అనిరుధ్ నేపథ్య సంగీతం .. ప్రసన్న ఎడిటింగ్ ఫరవాలేదు. 

'కాలం అనేక పరీక్షలతో నిన్ను చాలా కఠినంగా మార్చవచ్చు. కానీ అవతలివారిని ఆదుకోవడం .. సాయపడటం మాత్రం మరిచిపోకు. ఎందుకంటే నువ్వు మనిషివనే విషయాన్ని గుర్తుచేసేవి అవే' అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొచ్చు.