పరిణీతి చోప్రా ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'షాక్: ట్రస్ట్ నో వన్'. స్వప్న మల్హోత్రా -  సిద్ధార్థ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. హిందీలో రూపొందిన ఈ సిరీస్, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 24వ  తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

అన్విత (పరిణీతి చోప్రా) .. అలోక్ (తాహిర్ రాజ్ భాసిన్) భార్యాభర్తలు. 'సిమ్లా'లో వాళ్ల లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. అక్కడి హాస్పిటల్లో 'భాస్కర్' (సుమిత్ వ్యాస్) డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య శ్రేయ (హర్లీన్ సేథీ) ఇద్దరూ కూడా అలోక్ ఫ్యామిలీకి స్నేహితులుగా ఉంటారు. అన్వితకి నెలలు నిండటంతో, భాస్కర్ హాస్పిటల్లోనే చేరుస్తారు. అక్కడే ఆమె ఒక పాపకి జన్మమిస్తుంది. ఆ పాపకి 'అపేక్ష' అనే పేరు అనుకుంటారు. 

అయితే ఊహించని విధంగా హాస్పిటల్ నుంచి 'అపేక్ష' మాయమవుతుంది. హాస్పిటల్ కి సంబంధం లేని ఒక లేడీ, నర్స్ వేషంలో వచ్చి పాపని తీసుకెళ్లిపోయిందనే విషయాన్ని తెలుసుకుంటారు. కాకపోతే ఒక వైపున సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో, ఆమె ఎవరనేది కనుక్కోలేకపోతారు. అలా ఎనిమిదేళ్లు గడిచిపోతాయి. అన్విత - అలోక్ దంపతులకు 'సిద్ధి' అనే మరో పాప పుడుతుంది. అయినా అన్విత మాత్రం 'అపేక్ష'ను మరిచిపోలేకపోతుంది. తన కూతురు బ్రతికే ఉందనీ, తన ఆచూకీ తప్పకుండా తెలుస్తుందనే నమ్మకంతో ఉంటుంది. 

ఈ నేపథ్యంలో అన్విత అత్తగారు 'మాధురి' తరచూ ఒక మాంత్రికుడిని కలుస్తూ ఉంటుంది. అతనితో క్షుద్రపూజలు చేయిస్తూ ఉంటుంది. అపేక్ష నష్ట జాతకురాలు కావడం వలన, ఆ పాప తిరిగొస్తే తన కొడుక్కి ప్రమాదని భావించి ఆమె అలా చేయిస్తూ ఉంటుంది. ఇక భాస్కర్ కి తెలియకుండా శ్రేయ, అన్వితకి తెలియకుండా అలోక్ రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నందిని అనే ఒక పాపను ఒక శరణాలయంలో ఉంచి చదివిస్తూ ఉంటుంది శ్రేయ. 

 ఇలాంటి పరిస్థితులలోనే కొత్తగా సిమ్లాకి గౌరవ్ - సాక్షి దంపతులు వస్తారు. వాళ్ల పాప 'రియా'ను చూడగానే, అన్వితకి ఆ పాప తన కూతురు అపేక్ష కావొచ్చనే అనుమానం కలుగుతుంది. అప్పటి నుంచి వాళ్లను సందేహించడం మొదలుపెడుతుంది. ఇదే విషయాన్ని పోలీస్ ఆఫీసర్ 'ఖురానా'తో చెబుతుంది. దాంతో అతను కూడా వాళ్లపై ఒక కన్నేసి ఉంచుతాడు. అన్విత బిడ్డను కిడ్నాప్ చేసింది ఎవరు? అందుకు గల కారణం ఏమిటి? తన బిడ్డ కోసం ఆమె చేసే పోరాటం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.

ఇది ఒక తల్లి కథ .. హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయబడిన తన కూతురు తన దగ్గరికి తప్పకుండా తిరిగొస్తుందని నమ్మిన ఒక తల్లి కన్నీటి కథ. తన మానసిక స్థితి సరిగ్గా లేదని జనమంతా చెప్పుకుంటున్నా పట్టించుకోకుండా, తన కూతురు కోసం ఎనిమిదేళ్లుగా అన్వేషణ కొనసాగిస్తూ ఆవేదనతో చేసే ప్రయాణం కథ ఇది. తల్లీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా దర్శకుడు రాసుకున్న ఈ కథలో, అక్కడక్కడా రొమాన్స్ టచ్ ఇస్తూ వెళ్లారు.

ఈ కథలో అన్విత - అలోక్ దంపతులు, భాస్కర్ - శ్రేయ దంపతులు, గౌరవ్ - సాక్షి దంపతులు ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తారు. ఈ మూడు జంటలను కలుపుతూ వెళ్లిన కథ, మొదటి నుంచి చివరివరకూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఆడియన్స్ గెస్ చేయలేని విధంగా కథ అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇక అన్విత అత్తగారు చేయించే క్షుద్రపూజలు ఈ కథ పట్ల మరింత కుతూహలం పెరగడానికి కారణమవుతుంది. 

ప్రధానమైన పాత్రలను కలుపుకుంటూ సాగే కీలకమైన పాత్రగా పోలీస్ ఆఫీసర్ 'ఖురానా' కనిపిస్తాడు. ఎలాంటి టెస్టులు లేకుండానే ఒక తల్లి, పసికందుగా ఉన్నప్పుడు తప్పిపోయిన తన కూతురును గుర్తించగలదని భావించిన ఆయన, ఆమెకి పూర్తి అండగా నిలబడటం ఈ కథకు మరింత బలాన్ని ఇస్తుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ లో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎక్కడా ఏ ఎపిసోడ్ బలహీనపడినట్టుగా అనిపించదు. ప్రతి ఎపిసోడ్ బ్యాంగ్ ఆ తరువాత ఎపిసోడ్ పై ఉత్కంఠను పెంచుతుంది. 

ఇక ప్రతి పాత్రను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలను ఎత్తుకున్న తీరు .. చివరివరకూ నడిపించిన తీరు చాలా సహజంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కథను మరింత పట్టుగా .. పకడ్బందీగా పరుగులు తీయించాయి. ఈ సమయంలో చోటుచేసుకునే ట్విస్టులు  కదలనీయకుండా చేస్తాయి. కథ .. కథనం ఈ సిరీస్ ను బలంగా నిలబెడతాయి. నిర్మాణ విలువలు ఈ సిరీస్ భారీతనాన్ని నిలబెడతాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ చాలా నీట్ గా సాగుతాయి. 

ఆశలు .. వ్యామోహాలు జీవితాన్ని ఏ దిశగా తీసుకుని వెళతాయి? మూఢనమ్మకాలు జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని సృష్టిస్తాయి?  ప్రతీకారం వలన చివరికి సాధించేదేముంటుంది? అనే విషయాలను ఈ కథలో ఆవిష్కరిస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎవరితోనైనా పోరాడుతుంది. ఎంతకాలమైనా పోరాడుతుంది అనే సందేశం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఒకటిరెండు చోట్ల కాస్త అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి చూస్తే, ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటిగానే ఇది మిగిలిపోతుంది.