భారీ చిత్రాల నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మంచి పేరు ఉంది. 'దేవి' .. 'దేవీ పుత్రుడు' వంటి ఫాంటసీ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. దైవశక్తి - దుష్ట శక్తి నేపథ్యంలో ఆయన రూపొందించిన తాజా చిత్రమే 'అగధ'. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన సినిమా ఇది. కామాక్షి భాస్కర్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం.
మహాదేవి ( కామాక్షి భాస్కర్ల) తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతుంది. అప్పటి నుంచి బాబాయ్ (భానుచందర్) దగ్గరే పెరుగుతుంది. బాబాయ్ కి ఇద్దరు భార్యలు .. మొదటి భార్యకి మహిమ (ఉల్కా గుప్తా) శ్రీలక్ష్మి అనే ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఇక రెండవ భార్య సుశీల ( వనితా విజయ్ కుమార్)కి 'హరిణి' ( జోవిక విజయ్ కుమార్) అనే టీనేజ్ కూతురు ఉంటుంది. మహిమ చాలా కాలంగా 'శివ'ను ప్రేమిస్తుంటుంది. అతని కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. అయితే ఒకానొక అడవీ ప్రదేశంలో .. 'షికావా' అనే గుహలోకి అడుగుపెట్టిన తరువాత వాళ్ల జీవితాలు మారిపోతాయి.
గర్భవతిగా ఉన్న మహిమ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అంతే కాకుండా ఆమె చెల్లెలు 'హరిణి' ప్రవర్తనలో విపరీత ధోరణి చోటుచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా రావలసిందిగా మహాదేవికి ఆమె బాబాయ్ కబురుపెడతాడు. 'మహాదేవి'కి బాల్యంలోనే అమ్మవారి దర్శనమవుతుంది. అప్పటి నుంచి దుష్టశక్తులను నియంత్రించే శక్తులు ఆమెకి వస్తాయి. అందువలన దుష్టశక్తులచే పీడించబడుతున్నవాళ్లు ఆమెను ఆశ్రయిస్తుంటారు. అలాంటి మహాదేవి తన బాబాయ్ మాట మేరకు ఆ ఊరుకు చేరుకుంటుంది.
అటవీ ప్రాంతంలో ఒక గుహలోకి వెళ్లి వచ్చిన తరువాతనే మహిమ ఆత్మహత్య చేసుకుందనీ, చనిపోవడానికి ముందు ఆమె 'అగధ'ను చూసిందని మహాదేవి తెలుసుకుంటుంది. 'అగధ' ఎవరు? మహిమ కుటుంబ సభ్యులపై అగధ ఎందుకు పగబడుతుంది? అడవిలోని ఆ గుహలో ఆ రోజు ఏం జరుగుతుంది? అగధ బారి నుంచి మహాదేవి తన కుటుంబ సభ్యులను కాపాడుకోగలుగుతుందా? మహిమను ప్రేమించిన శివ ఏమైపోయాడు? అనేది మిగతా కథ.
చిన్నతనంలోనే అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన మహాదేవి, దుష్టశక్తులను తరిమేసే అతీంద్రియ శక్తులను సొంతం చేసుకుంటుంది. తనని ఆశ్రయించిన వారిని దుష్టశక్తుల బారి నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఆమెను పెంచి పెద్ద చేసిన బాబాయ్ ఫ్యామిలీ, 'అగధ' అనే దుష్టశక్తి బారిన పడుతుంది. అప్పుడు తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం మహాదేవి ఏం చేస్తుంది? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
తన లవర్ శివ .. స్నేహితుడు బబ్లూతో కలిసి 'బస్తర్' ఫారెస్టు ఏరియాలోని 'షికావా' అనే కేవ్ దగ్గరికి మహిమ బయల్దేరడంతో ఈ కథ మొదలవుతుంది. మహిమ చనిపోవడం .. ఆమె చెల్లెలు 'హరిణి' ఏదో దుష్టశక్తి ఆవహించినట్టుగా ప్రవర్తించడంతో ఈ కథ పుంజుకుంటుంది. 'అగధ' ఎవరో .. ఆ దుష్టశక్తి ఉద్దేశమేమిటో తెలుసుకుని, హరిణిని రక్షించుకోవడం కోసం మహాదేవి రంగంలోకి దిగడంతో ఈ కథ మరో మలుపు తీసుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ కి దగ్గర పడుతుండగా, కథ మరింత పుంజుకుని క్లైమాక్స్ దిశగా కదులుతుంది.
సాధారణంగా హారర్ థ్రిల్లర్ .. ఫాంటసీ టచ్ ఉన్న థ్రిల్లర్ సినిమాలలో కామెడీ అనేది కాస్తయినా కనిపిస్తుంది. కానీ ఎమ్మెస్ రాజు ఈ కథను మొదటి నుంచి చివరివరకూ సీరియస్ గా నడిపించారు. కథ ఎక్కడా కూడా గాడి తప్పకుండా సాగుతుంది. అలాగే కథకి తగిన సన్నివేశాలు .. ఆ సన్నివేశాలకు అవసరమైన గ్రాఫిక్స్ ను డిజైన్ చేసుకున్న తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అడవి నేపథ్యం .. అమ్మవారి రూపం .. గుహకి సంబంధించిన గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి.
ఎన్నో వేల ప్రేతాత్మల శక్తులను తనలో నింపుకున్న దుష్టశక్తియే 'అగధ'. దైవశక్తిని ఎదిరించి నిలవడం.. గెలవడం దాని ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ లైన్ కి తగినట్టుగా తెరపై దుష్టశక్తి - దైవశక్తి పోరాడే సన్నివేశాలు ఉంటాయనుకుంటే పొరబాటే. దైవశక్తిని బాలా రూపంలోనూ .. దుష్టశక్తిని అద్దం పెంకులోను చూపించడంతో దర్శకుడు సరిపుచ్చారు. దుష్టశక్తిని హాలీవుడ్ సినిమాలలోని చిత్రమైన జీవిలా చూపించి ఆశ్చర్యపరిచారు.
అడవి .. అక్కడి గిరిజనులు .. క్షుద్ర పూజలు .. నరబలులు .. 140 ఏళ్లకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం .. ఆ రోజునే శక్తులన్నీ పొందాలనుకున్న ఒక దుష్టశక్తి .. వంటి అంశాలు కథపై కాస్త ఉత్కంఠను పెంచుతాయి. అయితే ఈ అంశాలన్నీ గతంలోని సినిమాలలో కనిపిస్తూ .. వినిపిస్తూ వచ్చినవే. అవే సన్నివేశాలు నిదానంగా సాగుతూ ఉంటాయంతే. కాకపోతే విజువల్స్ .. చిత్రీకరణ పరంగా మెప్పిస్తూ వెళతాయి.
అయితే ఈ కథ మొత్తంలో అయోమయంలో పడేసే అంశం ఒకటి ఉంది. శివ .. సింహా .. సలీమ్ పాత్రలను ఒక్కరితో ఎందుకు వేయించారో అర్థం కాదు. క్లైమాక్స్ లో కార్లో వెళుతూ అందుకు గల కారణం ఏమిటో చెబుతారు కానీ, అది మనకి అర్థమైనట్టుగా .. కానట్టుగా ఉంటుంది. కామాక్షి భాస్కర్ల నటన బాగుంది. ఆమె ఎంపిక చాలా కరెక్టుగా అనిపిస్తుంది. కాకపోతే మహాదేవిగా ఆమె నుదుటున బొట్టు విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుని ఉండవలసిందని అనిపిస్తుంది.
భానుచందర్ - వనితా విజయ్ కుమార్ పాత్రలలో కొంచెం వెయిట్ వేయాలసింది. వనిత కూతురు జోవిక బాగానే చేసింది. విలన్ పాత్ర విలక్షణంగా ఏమీ అనిపించదు. రాకేశ్ వెంకటాపురం నేపథ్య సంగీతం .. నాని చమిడిశెట్టి ఆవిష్కరించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు .. గ్రాఫిక్స్ చెప్పుకోదగినవిగానే అనిపిస్తాయి. పాత అంశాలతో కూడిన కథనే .. నిదానంగా సాగే కథనమే, విజువల్స్ పరంగా మాత్రం తన మార్కు చూపిస్తూ సాగే సినిమాగా చెప్పుకోవచ్చు అంతే.
'అగధ' - మూవీ రివ్యూ!
Agadha Review
Movie Details
Movie Name: Agadha
Release Date: 2026-08-14
Cast: Kamakshi Bhskarla, Shravan Reddy, Ulka Guptha, Bhanuchandar, Vanitha Vijay Kumar, Jovika
Director: MS Raju
Music: Rakesh Venkatapuram
Banner: Sri Adivaraha Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer