తమిళంలో రూపొందిన సిరీస్ 'వదంతి'. సీజన్ 1కి సంబంధించిన ఈ సిరీస్, డిసెంబర్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ఎస్. జె. సూర్య పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన ఈ సిరీస్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సిరీస్ కి సీజన్ 2 అందుబాటులోకి వచ్చింది. 8 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్ లో శశికుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ నెల 7వ తేదీ నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
'చెన్నై' నుంచి 'మధురై'కి ఎనిమిది లైన్ల రోడ్ పనులు మొదలవుతాయి. అయితే మట్టి తీస్తుండగా, ఒక అస్థిపంజరం బయటపడుతుంది. ఈ విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవ నడుస్తూ ఉంటుంది. పనిష్మెంట్ పోస్టింగ్ పై వచ్చిన రాజా ( శశికుమార్) తన తోటి ఆఫీసర్ రామర్ ( వివేక్ ప్రసన్న)తో కలిసి ఈ కేసు వ్యవహారాలు చూస్తుంటాడు. ఎస్పీగా రతికా నాయర్ (అనఘా) రంగంలోకి దిగుతుంది. బయటపడిన అస్థిపంజరానికి ఒక చేయి లేకపోవడంతో మళ్లీ అక్కడ తవ్వకాలు జరుపుతారు. అప్పుడు వాళ్లకి అస్థి పంజరంలోని ఒక చేయి దొరుకుతుంది.
అయితే రిపోర్ట్స్ లో అస్థిపంజరం ఒకరిది .. చేయి ఒకరిది అనే విషయం తేలుతుంది. ఆ రెండూ ఇద్దరు యువతులవనే విషయం స్పష్టమవుతుంది. దాంతో ఆ దిశగా విచారణ జరపడం మొదలవుతుంది. రెండేళ్ల క్రితం ఇద్దరు యువతులు అదృశ్యమైన కేసు రాజా దృష్టికి వస్తుంది. అలాగే ఆ ఇద్దరు యువతులకి సంబంధించిన హత్యానేరంలో 'మణి' అనే యువకుడు శిక్షను అనుభవిస్తున్నట్టు తెలుసుకుంటాడు. జైల్లో అతణ్ణి కలుసుకుని మాట్లాడతాడు.
మణితో మాట్లాడిన తరువాత, ఆ హత్యలు అతను చేసి ఉండకపోవచ్చని రాజా భావిస్తాడు. అదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకుని వెళతాడు. పై అధికారుల నుంచి ఆమె పర్మిషన్ తీసుకురావడంతో, ఆ కేసును రీ ఇన్వెస్టిగేట్ చేయడానికి రాజా రంగంలోకి దిగుతాడు. ఆ ఇద్దరు యువతులను హత్య చేసింది ఒక సైకో అయ్యుండొచ్చని రాజా భావిస్తాడు. అతని అనుమానం నిజమే అవుతుందా? హత్యల వెనకున్న కారణాలు ఏమిటి? ఈ కేసును రాజా ఎలా ఛేదిస్తాడు? అనేది మిగతా కథ.
రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం .. తవ్వకాలలో ఒక అస్థిపంజరం బయటపడటంతో ఈ కథ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ గా పనిష్మెంట్ పోస్టింగులో ఉన్న రాజాకి ఈ కేసు సవాలుగా మారుతుంది. ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్లిన రాజాకి ఒక ప్రేమకథ తగులుతుంది. చనిపోయింది ప్రేమికురాలు అయితే .. హంతకుడిగా శిక్షను అనుభవిస్తున్నది ప్రేమికుడు. మరి మరో అస్థిపంజరానికి సంబంధించిన యువతి ఎవరు? అనేది ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతుంది.
సాధారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ తన ఇన్వెస్టిగేషన్ లో ఆ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ ఉండటం చూస్తాము. కానీ ఈ కథలో శిక్షను అనుభవిస్తున్న యువకుడు హత్య చేసి ఉండడు అని పోలీస్ ఆఫీసర్ భావిస్తాడు. విడుదలపై అతను ఆసక్తిని కనబరచకపోయినా, బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఇదే ఈ కథలో కొత్త పాయింట్ గా చెప్పుకోవచ్చు.ఇక ఒక్కో పాత్ర అనుమానితులుగా తెరపైకి వచ్చి వెళుతూ ఉంటుంది. దాంతో అసలు హంతకుడు ఎవరై ఉంటాడు అనే ఒక ఉత్కంఠ ఆడియన్స్ లో పెరుగుతూ పోతుంది.
మణి - దివ్య - సుందరేశన్ - వెంబా అనే రెండు ప్రేమ జంటలు, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ను కలుపుకుని మొత్తం 6 ప్రధానమైన పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. మణి - దివ్య ప్రేమించుకోవడం దివ్య అన్నయ్య 'నీలకంఠ'కి ఇష్టం ఉండదు. తన స్నేహతుడు సుందరేశన్ తన చెల్లెలు 'వెంబా'ను ఇష్టపడుతున్నాడనే సంగతి మణికి తెలియదు. ఈ ఇద్దరి అమ్మాయిలను ఎవరు చంపేసి ఉంటారనే విషయంపైనే కథ నడుస్తూ ఉంటుంది.
మొత్తం 8 ఎపిసోడ్స్ లో 6 ఎపిసోడ్స్ ఫరవాలేదన్నట్టుగా నడుస్తాయి. చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం, మిగతా ఎపిసోడ్స్ ను ప్రభావితం చేసేలా ఉంటాయి. ఈ కంటెంట్ బలాన్ని పెంచేదిలా ఉంటాయి. హత్యలకు సంబంధించిన చిక్కుముడులు విడిపోయేది ఈ ఎపిసోడ్స్ లోనే. హంతకులు ఎవరనేది ఆడియన్స్ ఎలాంటి పరిస్థితులలోను గెస్ చేయలేరు. అదే ఈ కథకు బలం అని చెప్పచ్చు. అలాగే విలేజ్ నేపథ్యం .. లొకేషన్స్ కూడా ఎక్కువ మార్కులు కొట్టేస్తాయి.
ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ఎవరికివారు తమ పాత్రలలో ఒదిగిపోయారు. పోలీస్ ఆఫీసర్ గా అనఘా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఆండ్రూ లూయిస్ కథ - స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. సైమన్ కింగ్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. లవ్ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. డ్రామాతో కూడిన కంటెంట్ ఇది. నిదానంగా సాగుతూనే అనూహ్యమైన మలుపులు తీసుకోవడం ఈ కథ ప్రత్యేకత. జరిగిపోయిన ఒక దారుణాన్ని మార్చలేం .. మరిచిపోలేం. కానీ బాధితులకు న్యాయం చేయవచ్చు అనే సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది.
'వదంతి 2'(అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
Vadhandhi 2 Review
Movie Details
Movie Name: Vadhandhi 2
Genre: Mystery, Thriller
Release Date: 2026-08-07
Cast: SasiKumar, Yashwanth, Anagha, Aparna Das, Vivek Prasanna
Director: Andrew Louis
PRO: -
Music: Simon King
Banner: Wallwatcher Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer