హార్ముజ్ జలసంధిని అమెరికా తెరుస్తుంది.. చైనా సహా ఆ దేశాలు యుద్ధ నౌకలను పంపించాలి: ట్రంప్
- హార్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో ప్రభావితమైన దేశాలు నౌకలను పంపించాలన్న ట్రంప్
- చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలు నౌకలను పంపిస్తాయని ఆశాభావం
- ఇరాన్ సైనిక స్థావరాలను 100 శాతం నాశనం చేశామన్న ట్రంప్
- హార్ముజ్‌ను స్వేచ్ఛగా, సురక్షితంగా ఉంచుతామని హామీ
అమెరికా నావికాదళం త్వరలో హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించారు. హార్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, ముఖ్యంగా ప్రభావితమైన దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను పంపించాలని కోరారు. ఈ జలసంధిని మూసివేయడం వల్ల ప్రభావితమైన దేశాలు తమతో కలుస్తున్నాయని తెలిపారు.
ఇరాన్ సైనిక స్థావరాలను 100 శాతం నాశనం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. తల తెగిన ఇరాన్ లాంటి దేశంతో ముప్పు ఉండదని స్పష్టమవుతోందని అన్నారు. ఇరాన్ తీర ప్రాంతంపై అమెరికా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. త్వరలో హార్ముజ్‌ను తెరుస్తామని, ఈ దారిని స్వేచ్ఛగా, సురక్షితంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చైనా వంటి దేశాలు నౌకలను పంపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.