గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య విషాదాంతం
- నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య
- హైదరాబాద్‌లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన వైనం
- సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాదఛాయలు
ఇటీవల నిజామాబాద్ నగర శివారులో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయి ముఠా హల్‌చల్ చేసింది. ఎక్సైజ్ సిబ్బందిని తప్పించుకునే ప్రయత్నంలో స్మగ్లర్లు తమ కారుతో ఎక్సైజ్ సిబ్బందిని ఢీ కొట్టారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడంతో ఎక్సైజ్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.