ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీర్పు నేడే.. ఉత్కంఠగా తెలంగాణ రాజకీయం
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు
- అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు ఇవ్వనున్న స్పీకర్ ప్రసాద్ కుమార్
- ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు నిర్ణయం వెల్లడి
- కోర్టు ఆదేశాల నేపథ్యంలో వేగవంతమైన చర్యలు
- తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఆయన తీర్పు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తుందా? లేక వ్యతిరేకంగా వస్తుందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.