టాలీవుడ్ నటి ప్రగతికి అభినందనలు తెలిపిన జనసేన వీరమహిళ విభాగం
- అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన ప్రగతి
- గోల్డ్ మెడల్ సహా 4 పతకాలు కైవసం
- ప్రగతిపై అభినందనల వర్షం
కళల నుంచి అంతర్జాతీయ క్రీడల వరకు బహుముఖ రంగాల్లో రాణిస్తున్న ప్రగతి వంటి మహిళలు ఎందరికో ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ వీరమహిళ విభాగం కొనియాడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
"ప్రగతి లాంటి మహిళలు శక్తి, పట్టుదల, స్ఫూర్తికి సజీవ నిదర్శనాలు. వారు అడ్డంకులను అధిగమిస్తూ, గొప్ప విజయాలు సాధిస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. వారి అంకితభావం, ధైర్యం అసంఖ్యాకమైన ఇతరులను తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహిస్తాయని తెలిపింది.
అభిరుచి, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ప్రగతి నిరూపిస్తున్నారని ప్రశంసించింది. ప్రగతి వంటి మహిళలను గౌరవించడం కేవలం వ్యక్తిగత విజయాలను గుర్తించడం మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి అంశంలో మహిళలు ప్రదర్శించే శక్తి, సామర్థ్యం, నాయకత్వ పటిమను గుర్తించడమేనని వీరమహిళ విభాగం స్పష్టం చేసింది.