వాళ్లు మరణించినా ధైర్యంగా ఉన్న ఇళయరాజా, బాలు చనిపోతే తట్టుకోలేకపోయారు: రజనీకాంత్
- సంగీత దర్శకుడు ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థానంపై తమిళనాడు ప్రభుత్వ సన్మానం
- హాజరైన సీఎం స్టాలిన్, రజనీకాంత్, కమల్‌హాసన్
- బాలు మరణవార్త విని ఇళయరాజా కన్నీటిపర్యంతమయ్యారని చెప్పిన రజనీకాంత్
- సొంతవారి మరణానికి చలించని ఆయన బాలు కోసం ఏడ్చారని వెల్లడి
సంగీత ప్రపంచంలో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటులు కమల్‌హాసన్, ప్రభు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్, ఇళయరాజ-ఎస్పీబీ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
"కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా ఇళయరాజా ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. అలాంటిది, ఎస్పీబీ మరణించారని తెలియగానే ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రమైన భావోద్వేగానికి గురై చిన్నపిల్లాడిలా ఏడ్చారు" అని రజనీకాంత్ ఆనాటి సంఘటనను వివరించారు.