అప్పుడు చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం... శ్రీదేవి కోసం రిస్క్ తీసుకున్నారు: నిర్మాత అశ్వనీదత్
- మే 9న థియేటర్లలోకి 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీ-రిలీజ్
- 35 ఏళ్ల సందర్భంగా రీమాస్టర్డ్ వెర్షన్ విడుదల
- 'దినక్కు తా' పాట షూటింగ్ నాటి చిరు కష్టాన్ని వివరించిన అశ్వినీదత్
- 106 డిగ్రీల జ్వరంలోనూ పాట పూర్తి చేశారని వెల్లడి
1990 మే 9న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అజరామరమైన పాటలు, అద్భుతమైన విజువల్స్, చిరంజీవి-శ్రీదేవిల కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అయితే, తెరపై కనిపించే ఆ అద్భుతం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని, ముఖ్యంగా 'దినక్కు తా' పాట సమయంలో చిరంజీవి అంకితభావం మరువలేనిదని అశ్వినీదత్ అన్నారు.
అశ్వినీదత్ మాటల్లో...
"ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి గారికి తీవ్రమైన జ్వరం. దాదాపు 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. కానీ శ్రీదేవి గారి కాల్షీట్లు చివరి రెండు రోజులే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె నెలన్నర పాటు విదేశాల్లో మరో షూటింగ్‌కు వెళ్లిపోవాలి. పాటను ఆ రెండు రోజుల్లోనే పూర్తి చేయాల్సిన ఒత్తిడి. ఒకే సెట్‌లో ఆ పాట మొత్తం తీయాలి. చిరంజీవి గారి పరిస్థితి చూసి షూటింగ్ ఆపేద్దామా అనిపించింది. కానీ ఆయన డెడికేషన్ అలాంటిది. ప్రతి షాట్‌కు ముందు, షాట్ గ్యాప్‌లో ఐస్ ప్యాక్‌లతో శరీరాన్ని చల్లబరుచుకుని, జ్వరం కొంచెం తగ్గాక మళ్లీ కెమెరా ముందుకొచ్చేవారు. అంత తీవ్రమైన జ్వరంలో కూడా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా డ్యాన్స్ చేశారు. ఆ రెండు రోజులు ఆయన పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయనను విజయ హాస్పిటల్‌లో చేర్పించాం. దాదాపు 15 రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. ఆయన అంకితభావం, వృత్తి పట్ల నిబద్ధత వల్లే ఆ పాట అంత అద్భుతంగా వచ్చింది" అని అశ్వినీదత్ వివరించారు.